అయ్యా కేటీఆర్, నీ చెల్లి నీ మీద మన్ను పోస్తోంది.. నాతో పెట్టుకుంటే నాశనమవుతావు: మంత్రి సీతక్క

  • తనను కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారన్న సీతక్క
  • ములుగు అభివృద్ధి చూసి బీఆర్ఎస్ నేతల అసూయ
  • ఓర్వలేకే నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
  • బీఆర్ఎస్ నేతలది కక్ష సాధింపు రాజకీయమే
  • పదేళ్ల పాలనలో ఎన్నో ఆత్మహత్యలకు వారే కారణమని ఆరోపణ
"అయ్యా కేటీఆర్, మీ చెల్లి ఎలాగూ మీ మీద మన్ను పోస్తోంది. నాతో పెట్టుకుంటే మీరు నాశనం అవుతారు. ఇంతకంటే నేను ఏమీ అనలేను. నాతో పెట్టుకుంటే మీరేం బాగుపడరు. నేను శాపనార్థాలు పెట్టగలను, అంతే. మీలాగా కులబలం, ధనబలం, అహంకారం నాకు లేవు. నేను ఒంటరిదాన్ని. నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలో చనిపోయాడు. నా నియోజకవర్గమే నాకు అండ. నా ములుగు ప్రజల దీవెనలతో నేను మంత్రిని అయ్యాను. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సహకారంతో నేను మంత్రిని అయ్యాను" అని అన్నారు.

బీఆర్ఎస్ నేతలు తనపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి బీఆర్ఎస్ నేత కేటీఆర్ తనను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ములుగు నియోజకవర్గంలో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని, అందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైన వారు, ఇప్పుడు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగడం ఎంతమాత్రం సరికాదని సీతక్క హితవు పలికారు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే తనపై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.


More Telugu News