జిమ్ కు వెళ్లడం మానేశాకే బరువు తగ్గా..: విద్యాబాలన్

  • కొవ్వు కాదు.. వాపు వల్లే లావయ్యానన్న నటి
  • చెన్నై సంస్థ సూచించిన ప్రత్యేక డైట్‌తో స్లిమ్ గా మారినట్లు వెల్లడి
  • ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుందని వ్యాఖ్య
శరీరంలో పేరుకుపోయిన అదనపు బరువును వదుల్చుకోవాలంటే క్రమం తప్పకుండా జిమ్ కు వెళుతూ చెమటోడ్చాల్సిందేనని నిపుణులు చెబుతుంటారు. అయితే, తాను మాత్రం జిమ్ కు వెళ్లడం మానేశాకే బరువు తగ్గానని బాలీవుడ్ నటి విద్యాబాలన్ చెప్పారు. దీనికి కారణం తన శరీరంలోకి చేరింది కొవ్వు కాదు, వాపు కావడమేనని వివరించారు. చెన్నైకి చెందిన ఓ సంస్థ సూచించిన ప్రత్యేక డైట్ ఫాలో అవుతూ బరువు తగ్గానని తెలిపారు. దాదాపు ఏడాదిగా తాను జిమ్ కు వెళ్లకుండా, ఎలాంటి వ్యాయామం చేయకుండానే స్లిమ్ గా మారినట్లు వివరించారు.

కెరీర్ ఆరంభం నుంచి తన బరువు విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న 46 ఏళ్ల విద్యా బాలన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో సన్నబడటానికి డైట్లు మార్చినా, కఠినమైన వర్కవుట్లు చేసినా ఫలితం తాత్కాలికమేనని, మళ్లీ బరువు పెరిగేదని గుర్తుచేసుకున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఈ ఏడాది మొదట్లో చెన్నైకి చెందిన 'అముర' అనే న్యూట్రిషనల్ గ్రూప్‌ను సంప్రదించినట్లు ఆమె తెలిపారు. తన శరీరంలో పేరుకుపోయింది కొవ్వు కాదని, అది కేవలం ఇన్ఫ్లమేషన్ (శరీరంలో ఒక రకమైన వాపు) అని వారు చెప్పినట్లు వెల్లడించారు. "వారు నాకోసం ఇన్ఫ్లమేషన్‌ను తొలగించే ప్రత్యేకమైన డైట్‌ను సూచించారు. అది నాకు అద్భుతంగా పనిచేసింది. బరువు అమాంతం తగ్గిపోయింది" అని విద్యాబాలన్ వివరించారు.

ఆ డైట్ మొదలుపెట్టిన తర్వాత తనను ఏడాది పాటు వ్యాయామం చేయవద్దని కూడా ఆ సంస్థ సూచించినట్లు ఆమె చెప్పారు. "ఈ ఏడాది మొత్తం నేను అస్సలు వర్కవుట్ చేయలేదు. అయినా అందరూ చాలా స్లిమ్‌గా మారావని అంటున్నారు. నేనెప్పుడూ లేనంత ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తున్నాను" అని అన్నారు. అయితే, తను పాటించిన పద్ధతి అందరికీ ఇదే ఫలితాన్ని ఇస్తుందని తాను చెప్పడంలేదన్నారు. ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్కలాగా ఉంటుందని, దానిని గౌరవించాలని విద్యా బాలన్ చెప్పారు.


More Telugu News