బంగ్లాదేశ్‌కు అమెరికా షాక్.. భారత టెక్స్‌టైల్ కంపెనీలకు కలిసొచ్చిన ట్రంప్ నిర్ణయం

  • బంగ్లాదేశ్ ఉత్పత్తులపై 35 శాతం సుంకం విధించిన అమెరికా
  • భారత టెక్స్‌టైల్ కంపెనీల షేర్లలో భారీ పెరుగుదల
  • ట్రంప్ నిర్ణయంతో స్టాక్ మార్కెట్‌లో లాభాల పంట
  • ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలు అమలులోకి రానున్నట్టు వెల్లడి
  • వాణిజ్య లోటును సరిదిద్దేందుకే ఈ చర్యలని స్పష్టం చేసిన ట్రంప్
అమెరికా తీసుకున్న ఒక కీలక వాణిజ్య నిర్ణయం భారత టెక్స్‌టైల్ రంగానికి అనూహ్యంగా కలిసివచ్చింది. బంగ్లాదేశ్‌ నుంచి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై 35 శాతం భారీ సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో భారత టెక్స్‌టైల్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. ఈ వార్తతో మదుపరులు భారత కంపెనీల వైపు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్‌లో సందడి నెలకొంది.

ట్రంప్ నిర్ణయం వెలువడిన వెంటనే, గోకుల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, వర్ధమాన్ టెక్స్‌టైల్స్, వెల్స్పన్ లివింగ్, అరవింద్ లిమిటెడ్, కేపీఆర్ మిల్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు లాభాల్లో దూసుకుపోయాయి. ముఖ్యంగా గోకుల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు 7 శాతానికి పైగా పెరగ్గా, వర్ధమాన్ టెక్స్‌టైల్స్ 7.4 శాతం, వెల్స్పన్ లివింగ్ 2 శాతం మేర లాభపడ్డాయి. అమెరికా మార్కెట్‌లో బంగ్లాదేశ్ వాటా 9 శాతంగా ఉండగా, ఈ సుంకాలతో ఆ దేశానికి గట్టి దెబ్బ తగలవచ్చని, అది భారత కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ మేరకు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్‌కు రాసిన లేఖలో ట్రంప్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త సుంకాలు అమలులోకి వస్తాయని తెలిపారు. తమ దేశంతో బంగ్లాదేశ్‌కు ఉన్న వాణిజ్య లోటు తమ ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని, దానిని సరిదిద్దేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా నుంచి వచ్చే వస్తువులపై 25 శాతం సుంకాలను ట్రంప్ విధించారు. ఇదే సమయంలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ చెప్పడం గమనార్హం.


More Telugu News