నగల దుకాణంలో దోపిడీ దొంగల బీభత్సం.. అడ్డుకున్న యజమాని కాల్చివేత

  • సూరత్‌లో నగల దుకాణంలో దోపిడీ
  • పరారవుతున్న దొంగలను వెంబడించిన స్థానికులు
  • ప్రజలపై దొంగల కాల్పులు.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
  • ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన జనం
  • పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసుల గాలింపు
గుజరాత్‌లోని సూరత్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలోకి చొరబడిన దుండగులు యజమానిని కాల్చి చంపి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు ధైర్యంగా దొంగలను వెంబడించి ఒకరిని పట్టుకోగా, మిగతా ముగ్గురు పరారయ్యారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సచిన్ ప్రాంతంలోని శ్రీనాథ్‌జీ జ్యూవెలర్స్ షోరూంలోకి గత రాత్రి 8:30 గంటల సమయంలో నలుగురు సాయుధ దుండగులు ప్రవేశించారు. వారు దోపిడీకి పాల్పడుతుండగా షోరూం యజమాని ఆశిష్ రాజ్‌పరా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన దొంగలు ఆయన ఛాతీపై రెండుసార్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆశిష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరవ్ గోహిల్ తెలిపారు.

దోపిడీ అనంతరం దుండగులు పారిపోతుండగా స్థానికులు వారిని వెంబడించారు. దీంతో దొంగలు ప్రజల వైపు కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నాజిమ్ షేక్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ తగలడంతో గాయపడ్డాడని డీఎస్పీ వివరించారు. కొంత దూరం వెంబడించిన తర్వాత, స్థానికులు ఒక దొంగను పట్టుకోగలిగారు. మిగిలిన ముగ్గురు తప్పించుకున్నారు.

పట్టుబడిన దొంగను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు. జనం నుంచి తప్పించుకునే క్రమంలో మిగతా ముగ్గురు దొంగలు నగల బ్యాగును షోరూం దగ్గరే వదిలి పారిపోయారని, దానిని స్థానికులు యజమాని కుటుంబానికి అప్పగించారని నీరవ్ గోహిల్ తెలిపారు. నిందితుల వద్ద మరిన్ని బ్యాగులు ఉన్నాయా అనే విషయంపై స్పష్టత లేదని, పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.


More Telugu News