పద్మనాభస్వామి ఆలయంలో స్పై కెమెరా కలకలం.. గుజరాత్ భక్తుడిపై కేసు

  • గుజరాత్‌కు చెందిన 66 ఏళ్ల యాత్రికుడి నిర్వాకం
  • స్మార్ట్ గ్లాసెస్ నుంచి లైట్ రావడంతో పసిగట్టిన భద్రతా సిబ్బంది
  • భక్తుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన సిబ్బంది
కేరళలోని ప్రఖ్యాత శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోకి రహస్య కెమెరాతో ప్రవేశించిన ఓ భక్తుడి ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆలయంలోకి స్మార్ట్ గ్లాసెస్ రూపంలో స్పై కెమెరాను తీసుకువెళ్లిన యాత్రికుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, గుజరాత్‌కు చెందిన 66 ఏళ్ల సురేంద్ర షా అనే యాత్రికుడు ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన ధరించిన కళ్లజోడు నుంచి కాంతి వెలువడటాన్ని అక్కడి భద్రతా సిబ్బంది గమనించి అనుమానంతో అతడిని ఆపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ఆయన కళ్లజోడును పరిశీలించగా అందులో రహస్య కెమెరా అమర్చి ఉన్నట్లు గుర్తించారు.

ఆలయంలోకి కెమెరాలు తీసుకువెళ్లడం, వీడియో చిత్రీకరణ చేయడం చట్టరీత్యా నేరం కావడంతో సురేంద్ర షాపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై బీఎన్ఎస్-223 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో, విచారణ పూర్తయ్యే వరకు సురేంద్ర షా, అతని కుటుంబ సభ్యులు తిరిగి గుజరాత్‌ వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. 


More Telugu News