Ramachander Rao: మీడియాపై దాడులు చేస్తే ఖబడ్దార్: రామచందర్ రావు

Ramachander Rao Warns Against Attacks on Media
  • మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని రామచందర్ రావు డిమాండ్ 
  • దాడులు కొనసాగితే టీ న్యూస్ అంతు చూస్తామని హెచ్చరిక
  • తప్పుడు వార్తలు రాస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని వ్యాఖ్య
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా సంస్థలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయగా, అక్రమ కట్టడాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

మీడియా సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేస్తున్నాయని, ఇది అత్యంత దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. మీడియా సంస్థలకు ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏబీఎన్ కార్యాలయానికి భద్రత కల్పించాలని బీజేవైఎం కార్యకర్తలకు సూచించినట్లు తెలిపారు.

ఇకపై మీడియాపై గానీ, సామాన్య ప్రజలపై గానీ దాడులు చేస్తే ఊరుకునేది లేదని, వారి అంతు చూస్తామని హెచ్చరించారు. "మీడియా సంస్థలపై దాడులు చేస్తే ఖబడ్దార్... టీ న్యూస్ సంగతి చూస్తాం" అని బీఆర్ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తామని, తమపై తప్పుడు వార్తలు రాస్తే న్యాయపరంగానే ఎదుర్కొంటామని, దాడులు చేయబోమని స్పష్టం చేశారు.

అదే సమయంలో, పాతబస్తీలోని సల్కం చెరువు భూమిలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నిర్మించిన అక్రమ కాలేజీ భవనంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భవనాన్ని కూల్చలేమని ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు. అక్బరుద్దీన్‌కు ఒక న్యాయం, మూసీ పరీవాహక ప్రాంతాల్లోని పేదలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని, లేకపోతే ప్రజల పక్షాన బీజేపీయే ఆ పని చేస్తుందని కాంగ్రెస్ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు.
Ramachander Rao
BJP
BRS
Congress
ABN Andhra Jyothi
Media Attacks
Telangana Politics
Akbaruddin Owaisi
Illegal Construction
T News

More Telugu News