Vietnam farmer: వరదలో చిక్కుకున్న చిన్నారులను డ్రోన్‌తో రక్షించిన రైతు.. వీడియో ఇదిగో!

Vietnam Farmer Uses Drone to Rescue Children Stranded in Flood
  • వియత్నాంలో రైతు సమయస్ఫూర్తి.. ప్రాణాలను నిలబెట్టిన వ్యవసాయ డ్రోన్
  • వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురు చిన్నారులు
  • వ్యవసాయ డ్రోన్‌తో రంగంలోకి దిగిన స్థానిక రైతు
  • తాడు కట్టి ఇద్దరు పిల్లలను గాల్లో ఎత్తి ఒడ్డుకు చేర్చిన డ్రోన్
ఆవులను మేపుతూ నది దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు చిన్నారులు వరదలో చిక్కుకున్నారు. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా వరద ముంచెత్తింది. ఇది గమనించిన ఓ రైతు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ ముగ్గురినీ కాపాడాడు. తన వ్యవసాయ డ్రోన్ కు తాడు కట్టి ఇద్దరు పిల్లలను ఒడ్డుకు చేర్చాడు. మూడో చిన్నారిని అధికారులు పడవలో వెళ్లి కాపాడారు. వియత్నాంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. వియత్నాంలోని గియా లై రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీన ఇయా తుల్ కమ్యూన్‌కు చెందిన ముగ్గురు చిన్నారులు ఆవులను మేపుతూ బా నదిని దాటే ప్రయత్నం చేశారు. అయితే నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారు మధ్యలోనే చిక్కుకుపోయారు. ఒడ్డుకు దాదాపు 50 మీటర్ల దూరంలో ఉన్న చిన్నారులను గమనించిన స్థానికులు, వెంటనే సహాయం కోసం కేకలు వేశారు.

సమీపంలో పొలం అద్దెకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న ట్రాన్ వాన్ నఘియా అనే రైతు వెంటనే స్పందించాడు. తన వద్ద ఉన్న వ్యవసాయ పనులకు వాడే డ్రోన్‌ను రంగంలోకి దించాడు. డ్రోన్‌కు తాడు కట్టి, దాని సాయంతో మొదట ఓ బాలికను గాల్లోకి లేపి జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత మరో చిన్నారిని కూడా అదే విధంగా కాపాడాడు. సమాచారం అందుకున్న అధికారులు పడవ సహాయంతో మూడో చిన్నారిని రక్షించారు.

ఈ సందర్భంగా రైతు నఘియా మాట్లాడుతూ, "నా డ్రోన్ 50 కిలోల బరువును మోయగలదు. అందుకే పిల్లలను సురక్షితంగా కాపాడగలనని నమ్మకంతో ఉన్నాను. డ్రోన్‌కు మరిన్ని తాళ్లు కట్టి పిల్లలను ఒడ్డుకు చేర్చగలిగాను" అని తెలిపారు. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో ఈదుతూ వెళ్లి వారిని కాపాడటం అసాధ్యమని ఆయన వివరించారు. రైతు చూపిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని స్థానికులు, అధికారులు అభినందించారు.
Vietnam farmer
drone rescue
child rescue
flood rescue
Gia Lai province
Ba River
agricultural drone
drone technology

More Telugu News