Truth Social: ట్రూత్ సోషల్ కు యూజర్లు కరువు.. కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం సున్నా

Truth Social Struggles to Retain Users Despite Investments
  • యూజర్లను నిలుపుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్న వైనం
  • గణనీయంగా పడిపోయిన నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య
  • అసలదేంటని ఎగతాళి చేసిన ఎలాన్ మస్క్
భావప్రకటనా స్వేచ్ఛకు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'కు యూజర్ల ఆదరణ కరువైంది. తొలినాళ్లలో భారీగా చేరిన యూజర్లు తర్వాతి కాలంలో వైదొలిగారు. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ వేదిక, వినియోగదారులను ఆకట్టుకోవడంలో, నిలుపుకోవడంలో తీవ్రంగా విఫలమవుతోంది. ఈ పరిస్థితిని చూసి ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ ఎద్దేవా చేయడం గమనార్హం. "ట్రూత్ సోషల్ అంటే ఏమిటి? దాని గురించి నేనెప్పుడూ వినలేదు" అంటూ మస్క్ ఎక్స్‌ లో పోస్ట్ చేయడం సంచలనం రేపింది.

సిమిలర్‌ వెబ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 2024 నాటికి ఈ ప్లాట్‌ఫామ్‌ లో కేవలం 50 లక్షల మంది యాక్టివ్ యూజర్లు మాత్రమే ఉన్నారు. ఇదే సమయంలో ఫేస్‌బుక్‌ కు సుమారు 300 కోట్లు, టిక్‌టాక్‌ కు 100 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉండటం గమనార్హం. ట్రూత్ సోషల్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య యూజర్లను నిలుపుకోలేకపోవడమే. దాదాపు 49 శాతం మంది వినియోగదారులు రెండు నెలల తర్వాత యాప్‌ను వాడటం మానేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

మే 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య వెబ్‌సైట్ సందర్శనలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 39 శాతానికి పైగా పడిపోయాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ లో ఎక్కువగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులే ఉన్నారు. డెమొక్రాట్లు దీనికి దూరంగా ఉంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ప్లాట్‌ఫామ్‌ లో చేరారు. తన 2019 అమెరికా పర్యటనకు సంబంధించిన ఫోటోను పంచుకుంటూ ఆయన తన తొలి పోస్ట్ చేశారు. అయితే, ట్రంప్ మీడియా పబ్లిక్‌ గా లిస్ట్ అయినప్పుడు కొంత ట్రాఫిక్ పెరిగినప్పటికీ, దీర్ఘకాలంలో యూజర్లను నిలుపుకోవడం ట్రూత్ సోషల్‌కు అతిపెద్ద సవాల్‌ గా మారింది.
Truth Social
Donald Trump
Elon Musk
Social Media Platform
User Engagement
Narendra Modi
X Twitter
Facebook
Republican Party
Digital Marketing

More Telugu News