Australia: విందుకు పిలిచి విషం పెట్టింది.. ముగ్గురి హత్య కేసులో మహిళ దోషిగా నిర్ధారణ

Australian woman found guilty of murdering three family members with poisonous mushrooms
  • విషపూరిత పుట్టగొడుగులతో వండిన ఆహారం పెట్టి ముగ్గురు కుటుంబ సభ్యుల హత్య
  • ఆస్ట్రేలియాకు చెందిన ఎరిన్ ప్యాటర్సన్‌ను దోషిగా నిర్ధారించిన సుప్రీంకోర్టు జ్యూరీ
  • మృతుల్లో అత్తమామలు, వారి బంధువు.. ప్రాణాలతో బయటపడ్డ మరొకరు 
  • బీఫ్ వంటకంలో డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడిని కలిపినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపణ
  • క్యాన్సర్ అని అబద్ధం చెప్పి బాధితులను విందుకు పిలిచినట్టు విచారణలో వెల్లడి
కుటుంబ సభ్యులకు విషపూరిత పుట్టగొడుగులతో వండిన ఆహారాన్ని తినిపించి, వారిలో ముగ్గురి మరణానికి కారణమైన కేసులో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళను కోర్టు దోషిగా నిర్ధారించింది. మరొకరిపై హత్యాయత్నం చేసినట్టు కూడా తేల్చింది. ఈ సంచలన ఘటనలో 50 ఏళ్ల ఎరిన్ ప్యాటర్సన్‌ను విక్టోరియా సుప్రీంకోర్టు జ్యూరీ సోమవారం దోషిగా ప్రకటించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... 2023 జులైలో మెల్‌బోర్న్‌కు 110 కిలోమీటర్ల దూరంలోని లియోన్‌గాథ పట్టణంలో ఉన్న తన నివాసంలో ఎరిన్ ప్యాటర్సన్ ఒక విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు హాజరైన ఆమె భర్త తల్లిదండ్రులు డాన్, గేల్ ప్యాటర్సన్‌తో పాటు, గేల్ సోదరి హీథర్ విల్కిన్సన్ ఆ ఆహారం తిని కొద్దిరోజులకే మరణించారు. హీథర్ భర్త ఇయాన్ విల్కిన్సన్ తీవ్ర అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో వారాలపాటు చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు.

దాదాపు 10 వారాల పాటు సాగిన విచారణలో ప్రాసిక్యూషన్ కీలక వాదనలు వినిపించింది. ఎరిన్ ఉద్దేశపూర్వకంగా అత్యంత ప్రమాదకరమైన 'డెత్ క్యాప్' పుట్టగొడుగులను సేకరించి, వాటిని ఎండబెట్టి, పొడిగా మార్చిందని ఆరోపించింది. ఆ పొడిని 'బీఫ్ వెల్లింగ్‌టన్' అనే వంటకంలో కలిపి అతిథులకు వడ్డించిందని జ్యూరీకి వివరించింది. అంతేకాకుండా, తనకు క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పి వారిని విందుకు రప్పించిందని, అనుమానం రాకుండా ఉండేందుకు త‌న‌క్కూడా ఆ ఆహారం వల్ల అనారోగ్యం వచ్చినట్టు నటించిందని, పోలీసుల విచారణ మొదలవగానే సాక్ష్యాలను నాశనం చేసిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

అయితే, ఈ ఆరోపణలను ఎరిన్ ఖండించింది. తాను నిర్దోషినని, పొరపాటున మాత్రమే విషపు పుట్టగొడుగులు వంటలో కలిసిపోయాయని వాదించింది. ఎరిన్‌తో విడిగా ఉంటున్న ఆమె భర్త సైమన్ ప్యాటర్సన్‌ను కూడా ఈ విందుకు ఆహ్వానించగా, ఆయన చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. జ్యూరీ సుదీర్ఘ విచారణ తర్వాత ఆమెను దోషిగా తేల్చింది. త్వరలోనే న్యాయస్థానం ఆమెకు శిక్షను ఖరారు చేయనుంది.
Australia
Erin Patterson
Mushroom poisoning
Australia murder case
Leongatha
Death cap mushrooms
Victorian Supreme Court
Dan Patterson
Gail Patterson
Heather Wilkinson
Ian Wilkinson

More Telugu News