సీఎం చెప్పినా సరే కుదరదు పొమ్మన్న స్కూలు యాజమాన్యం

  • యూపీలో ఏడో తరగతి బాలిక ఫీజు మాఫీపై రాజకీయ రగడ
  • బాలిక ఫీజు మాఫీ చేపిస్తానంటూ సీఎం యోగి హామీ
  • మాఫీ చేయడం కుదరదని తేల్చిచెప్పిన యాజమాన్యం
  • యోగి సర్కారుపై మండిపడ్డ ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్
ఉత్తరప్రదేశ్‌లో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఫీజు వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఐఏఎస్ అధికారి కావాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు సాయం చేయాలని ఆ చిన్నారి చేసిన విజ్ఞప్తి, అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

వివరాల్లోకి వెళితే.. గోరఖ్‌పూర్‌లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పంఖురి త్రిపాఠి ఏడో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి రాజీవ్ కుమార్ త్రిపాఠి ఓ ప్రమాదంలో కాలికి తీవ్ర గాయం కావడంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. దీంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. స్కూల్ ఫీజు సుమారు రూ.18,000 చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పంఖురి తన తండ్రితో కలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంది. ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం రాదని సీఎం వారికి హామీ ఇచ్చారు.

సీఎం హామీతో పాఠశాలకు వెళ్లిన తమతో యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందని పంఖురి ఆరోపించింది. ఫీజు మాఫీ చేసే నిబంధన ఏదీ లేదని, అందరికీ మాఫీ చేస్తే స్కూల్ నడపడం కష్టమని చెప్పారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. "సీఎంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన నా కలను చనిపోనివ్వరు. కష్టపడి చదివి ఐఏఎస్ అవుతాను" అని పంఖురి ధీమా వ్యక్తం చేసింది.

ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ఆ బాలిక చదువు ఆగిపోకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, అఖిలేశ్ సాయంపై పంఖురి తండ్రి స్పందిస్తూ.. తమకు యోగి ఆదిత్యనాథ్‌పైనే నమ్మకం ఉందని, ఆయనే తమ కుమార్తె చదువును చూసుకుంటారని తెలిపారు. ఈ వివాదంపై పాఠశాల యాజమాన్యం స్పందించేందుకు నిరాకరించింది.


More Telugu News