Constable: 12 ఏళ్లుగా విధులకు డుమ్మా... అయినా ప్రతి నెలా ఖాతాలో జీతం!

Constable Gets Salary for 12 Years Absence in Madhya Pradesh
  • 12 ఏళ్లుగా విధులకు గైర్హాజరైనా కానిస్టేబుల్ బ్యాంక్ ఖాతాలో జీతం జమ
  • మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన 
  • విచారణకు ఆదేశించిన అధికారులు
మధ్యప్రదేశ్ రాష్ట్రం, విదిశా జిల్లా, భోపాల్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఓ కానిస్టేబుల్ 12 సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండానే ప్రతి నెలా జీతం పొందుతూ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే.. 2011లో ఒక వ్యక్తి భోపాల్ పోలీస్ లైన్స్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. కొద్ది రోజుల తర్వాత అతడిని శిక్షణ కోసం సాగర్‌కు పంపాలని అధికారులు నిర్ణయించారు. అక్కడ ఇన్ఛార్జ్‌గా ఉన్న అధికారి సర్వీస్ రికార్డును అతనికి ఇచ్చి పంపాడు. అయితే, ఆ కానిస్టేబుల్ శిక్షణకు వెళ్లకుండా వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత సర్వీస్ రికార్డును పోలీస్ లైన్స్‌లోని అధికారులకు స్పీడ్ పోస్టు ద్వారా పంపించాడు. అధికారులు వాటిని సరిగ్గా పరిశీలించకుండానే ఆమోదించారు. దీంతో అతను పోలీస్ లైన్స్‌లోనూ, సాగర్‌లోని శిక్షణ కేంద్రంలోనూ ఎక్కడా లేకుండా పోయాడు. అతను ఎక్కడ పనిచేస్తున్నాడనే విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.

కానీ రికార్డుల్లో పేరు ఉండటంతో విధులకు హాజరు కాకపోయినా 12 ఏళ్లుగా అతని ఖాతాలో జీతం జమ అవుతూనే ఉంది. ఇలా దాదాపు రూ.28 లక్షలు అతని ఖాతాలో జమ అయినట్లు తెలుస్తోంది. అతను జీతం డబ్బులు వాడుకుంటున్నా, శిక్షణకు వెళ్లలేదు, విధులకు హాజరు కాలేదు.

అయితే, దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న పోలీసులను బదిలీ చేయడం, 2011 బ్యాచ్ వారికి పే గ్రేడ్ మదింపుపై డీజీపీ ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో ఇతని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అతను ఎక్కడ పనిచేస్తున్నాడనే వివరాలు అధికారుల వద్ద లేవు. దీంతో విచారణ చేపట్టగా, అతను అసలు శిక్షణకే వెళ్లలేదని, విధులకు హాజరు కావడం లేదని తెలిసింది. అధికారులు అతనికి నోటీసులు పంపి వివరణ కోరారు.

నోటీసులపై స్పందించిన ఆ కానిస్టేబుల్, తాను మానసిక సమస్యతో బాధపడ్డానని, అందుకే అధికారులకు సమాచారం ఇవ్వలేకపోయానని వివరణ ఇస్తూ సంబంధిత మెడికల్ రిపోర్టులను అందించాడు. ఇప్పటి వరకు జీతంగా తీసుకున్న మొత్తంలో కొంత డబ్బును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని, మిగతా అమౌంట్ కూడా చెల్లిస్తానని చెప్పాడు. ఈ కానిస్టేబుల్ వ్యవహారంపై అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత ఆ కానిస్టేబుల్‌తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
Constable
Madhya Pradesh
Vidisha
Bhopal
Police
Salary
Absenteeism
Investigation
negligence
pay grade

More Telugu News