Texas Floods: టెక్సాస్‌లో వరద బీభత్సం... 69కి చేరిన మృతుల సంఖ్య

Death toll in Texas flood rises to over 65
  • అమెరికాలోని టెక్సాస్‌లో జల ప్రళయం
  • వరదల కారణంగా 69కి పెరిగిన మృతుల సంఖ్య
  • మృతుల్లో 21 మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడి
  • ఒక్క కెర్విల్లే కౌంటీలోనే 59 మంది మృతి
  • ఈ ఘోర విషాదంపై స్పందించిన ప్రధాని మోదీ
మెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య 69కి చేరింది. చ‌నిపోయిన వారిలో 21 మంది చిన్నారులు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. పలు ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

అత్యధికంగా కెర్విల్లే కౌంటీలో వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఒక్క కౌంటీలోనే 59 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 21 మంది చిన్నారులేనని షెరీఫ్ లారీ లీథా తెలిపారు. క్యాంప్ మిస్టిక్‌కు చెందిన 11 మంది విద్యార్థులు, ఒక కౌన్సిలర్ ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఆయన వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 కౌంటీలు వరదల ప్రభావానికి గురయ్యాయని అధికారులు తెలిపారు.

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ మరో ఆరు కౌంటీలను కూడా విపత్తు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శిథిలాలను తొలగించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు తక్షణమే స్పందించి విపత్తుగా ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు. పేరుకుపోయిన శిథిలాల వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని ఆయన అన్నారు. రానున్న 24 నుంచి 48 గంటల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

స్పందించిన ప్రధాని మోదీ 
ఈ ఘోర విషాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. టెక్సాస్ వరదల్లో ప్రాణనష్టం, ముఖ్యంగా చిన్నారులు మరణించడం తీవ్ర విచారకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు, అమెరికా ప్రభుత్వానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలు ఊహకందని విషాదాన్ని ఎదుర్కొంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.

టెక్సాస్ ప్రజా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 18 పడవలు, 11 మంది టెక్సాస్ రేంజర్లు, 9 హెలికాప్టర్లతో గాలింపు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన చిన్నారులను గుర్తించడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
Texas Floods
Texas
Floods
US Floods
Kerriville County
Greg Abbott
Donald Trump
Narendra Modi
Natural Disaster

More Telugu News