కొవిడ్ టీకాలపై ఆందోళన.. స్పందించిన ఎయిమ్స్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్

  • ఆకస్మిక మరణాలకు టీకాలకు సంబంధం లేదన్న నిపుణులు
  • కర్ణాటక సీఎం వ్యాఖ్యలతో మొదలైన చర్చ
  • టీకాలు తీసుకున్నవారికే గుండెపోటు ముప్పు తక్కువన్న ఎయిమ్స్
  • ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ అధ్యయనాల్లోనూ ఇదే విషయం వెల్లడి
కొవిడ్-19 టీకాల భద్రతపై మరోసారి తలెత్తిన సందేహాలను వైద్య నిపుణులు, టీకా తయారీ సంస్థలు ఖండించాయి. ఇటీవలి కాలంలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాల, గుండెపోటులకు వ్యాక్సిన్‌లకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. ఈ విషయంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), ఎయిమ్స్ ఆధ్వర్యంలో జరిగిన రెండు వేర్వేరు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయని నిపుణులు గుర్తు చేశారు.

కర్ణాటకలోని హసన్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో సుమారు 20 మంది గుండె సంబంధిత సమస్యలతో మరణించడంతో, ఆ మరణాలకు కొవిడ్ టీకాలే కారణం కావొచ్చంటూ అనుమానాలున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టీకా తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఎయిమ్స్ వైద్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై స్పష్టతనిచ్చాయి.

ఈ అంశంపై ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్‌ గులేరియా మాట్లాడుతూ, "యువతలో ఆకస్మిక మరణాలపై ఇప్పటికే లోతైన అధ్యయనాలు జరిగాయి. వ్యాక్సిన్లకు, గుండెపోటు మరణాలకు సంబంధం ఉన్నట్లు ఏ పరిశోధనలోనూ వెల్లడి కాలేదు. అన్ని ఔషధాల మాదిరిగానే వీటికి కొన్ని స్వల్ప దుష్ప్రభావాలు ఉండొచ్చు కానీ, ప్రాణాంతకం కాదు" అని వివరించారు.

ఎయిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఐసీఎంఆర్, ఎయిమ్స్ అధ్యయనాల ప్రకారం కొవిడ్ టీకాలు తీసుకున్న వారికి ఆకస్మిక గుండెపోటు ముప్పు తక్కువగా ఉన్నట్లు తేలింది. వ్యాక్సిన్ వల్ల ప్రయోజనమే తప్ప హాని లేదని స్పష్టంగా రుజువైంది" అని ఆయన తెలిపారు.

యువతలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు వారి జీవనశైలి, ముందస్తు ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణమని, వ్యాక్సిన్‌లు కాదని కేంద్ర వైద్య-ఆరోగ్య శాఖ కూడా తేల్చి చెప్పింది. దేశీయంగా తయారైన టీకాలు సురక్షితమైనవని, వాటి పనితీరు సమర్థంగా ఉందని ఐసీఎంఆర్, జాతీయ రోగ నియంత్రణ కేంద్రం అధ్యయనాలు వెల్లడించాయని పేర్కొంది.


More Telugu News