జ‌గ‌న్‌ను క‌లిసిన వ‌ల్ల‌భ‌నేని వంశీ

  • నిన్న‌ జైలు నుంచి విడుదలైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
  • ఈ రోజు వైసీపీ అధినేత జగన్‌తో భేటీ
  • కష్టకాలంలో అండగా నిలిచినందుకు అధినేతకు కృతజ్ఞతలు
  • వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్
  • దాదాపు 140 రోజుల పాటు జైల్లో ఉన్న వంశీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఈ రోజు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపి బుధవారం విడుదలైన ఆయన, మరుసటి రోజే జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ, కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు అధినేతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్.. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. జైలులో ఉన్న సమయంలో వంశీ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.

కాగా, కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వంశీపై మొత్తం 11 కేసులు నమోదు చేసి వేధించారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ కేసుల కారణంగానే ఆయన సుమారు నాలుగున్నర నెలల పాటు విజయవాడ జైలులో ఉండాల్సి వచ్చిందని వారు దుయ్య‌బ‌డుతున్నారు.

వంశీకి న్యాయస్థానంలో బెయిల్ లభించినా, దానిని రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించడంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు.



More Telugu News