స్వల్పంగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు: జూన్‌లో రూ.1.85 లక్షల కోట్లు

  • గత రెండు నెలలతో పోలిస్తే తగ్గిన వసూళ్లు
  • గతేడాదితో పోలిస్తే 6.2 శాతం వృద్ధి నమోదు
  • విజయవంతంగా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న జీఎస్టీ విధానం
  • గత ఐదేళ్లలో రెట్టింపైన పన్ను వసూళ్లు
దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల జోరుకు స్వల్పంగా బ్రేక్ పడింది. వరుసగా రెండు నెలల పాటు రూ.2 లక్షల కోట్ల మార్కును అధిగమించిన వసూళ్లు, జూన్‌లో మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 2025 జూన్ నెలకు గాను రూ.1.85 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

గత సంవత్సరంతో పోలిస్తే వసూళ్లలో వృద్ధి కనబడనప్పటికీ, అంతకుముందు నెలలతో పోలిస్తే ఈ మొత్తం తక్కువగా ఉంది. గతేడాది జూన్‌తో పోల్చి చూస్తే ప్రస్తుత వసూళ్లు 6.2 శాతం అధికమని కేంద్రం పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్లు, మే నెలలో రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఆ గణాంకాలతో పోలిస్తే జూన్‌లో వసూళ్లు కొంత మేర తగ్గాయి.

మరోవైపు, దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చి జులై 1 నాటికి విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో జీఎస్టీ వసూళ్లు రెట్టింపు అయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.11.37 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం జీఎస్టీ వసూళ్లు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.20.08 లక్షల కోట్లకు పెరిగాయని వివరించింది.


More Telugu News