కెనడాలో కూతురు అరెస్ట్ అయ్యిందంటూ హైదరాబాద్ వ్యాపారికి బెదిరింపులు

  • డ్రగ్స్ కేసులో మీ కూతుర్ని అరెస్ట్ చేశాం, డబ్బులిస్తే కానీ వదిలిపెట్టబోమని హెచ్చరిక
  • కాల్ కట్ చేసి కూతురుకు ఫోన్ చేసిన తండ్రి.. క్షేమంగానే ఉన్నానంటూ బదులిచ్చిన కూతురు
  • పోలీసులకు ఫిర్యాదు.. వీడియో కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చిందని గుర్తించిన పోలీసులు
  • పాకిస్థాన్ నంబర్ నుంచి వాట్సప్ కాల్, టీజీసీఎస్‌బీలో కేసు నమోదు
"మీ అమ్మాయిని ఇక్కడ (కెనడాలో) అరెస్టు చేశాం.. మేం చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే ఆమెపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాం" అంటూ సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని బెదిరించి డబ్బు గుంజేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ వ్యాపారి సమయస్ఫూర్తితో వ్యవహరించి వారి వలలో చిక్కకుండా తప్పించుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్ గ్రీన్‌పార్క్ కాలనీకి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యాపారికి ఈ నెల 19న ఒక వాట్సప్ కాల్ వచ్చింది. స్క్రీన్‌పై ‘సీబీఐ విక్రమ్‌’ అని పేరు కనిపించడంతో పాటు, వాట్సప్ డీపీగా తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఫొటో ఉండటంతో శ్రీనివాసరెడ్డి ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసిన వ్యక్తులు తమను తాము కెనడా సైబర్‌క్రైమ్‌ విభాగం అధికారులమని పరిచయం చేసుకున్నారు.

"మీ అమ్మాయి డ్రగ్స్ కేసులో పట్టుబడింది. వెంటనే మేం చెప్పిన ఖాతాకు రూ.50 వేలు జమచేస్తే ఆమెను వదిలేస్తాం. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయి, థర్డ్‌ డిగ్రీ కూడా ప్రయోగించాల్సి వస్తుంది" అని వారు హెచ్చరించారు. దీనితో పాటు వెంటనే ఒక ఫోన్‌పే నంబర్‌ను కూడా పంపించారు. అయితే, ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు వెనుక నుంచి కొందరి అరుపులు వినపడటంతో శ్రీనివాసరెడ్డికి అనుమానం వచ్చింది. దీంతో, తన కుమార్తెతో మాట్లాడించాలని డిమాండ్ చేయగా, నేరగాళ్లు అందుకు నిరాకరించారు. డబ్బులు ఇస్తేనే మాట్లాడిస్తామని స్పష్టం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో డబ్బులు పంపే ఆలోచనను విరమించుకున్న శ్రీనివాసరెడ్డి, వెంటనే వాట్సప్ కాల్ కట్ చేసి కెనడాలో ఉన్న తన కుమార్తెకు ఫోన్ చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని, తననెవరూ అరెస్ట్ చేయలేదని కుమార్తె చెప్పడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. మోసపోయానని గ్రహించిన ఆయన, ఆ వాట్సప్ నంబరు పాకిస్థాన్‌కు చెందినదిగా గుర్తించి, తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)లో ఫిర్యాదు చేశారు. అధికారులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News