హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. అసలు విషయం చెప్పేసిన ఈషా గుప్తా!

  • హార్దిక్ పాండ్యాతో డేటింగ్ వార్తలపై నటి ఈషా గుప్తా క్లారిటీ
  • కొంతకాలం ఇద్దరం మాట్లాడుకున్నాం, కానీ అది డేటింగ్ కాద‌న్న‌ ఈషా
  • ఒకట్రెండు సార్లు కలిశాం, ఆ తర్వాత ఆగిపోయింద‌ని వెల్లడి
  • కాఫీ విత్ కరణ్ వివాదం త‌న‌ను ప్రభావితం చేయలేద‌న్న‌ నటి
బాలీవుడ్ నటి ఈషా గుప్తా, ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో తనకున్న బంధంపై వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు తెరదించారు. గతంలో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. తాజాగా సిద్ధార్థ్ కన్నన్‌ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈషా గుప్తా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఈ విషయాలపై స్పష్టతనిచ్చారు.

అది డేటింగ్ కాదు.. కేవలం మాటలే
హార్దిక్ పాండ్యాతో తనకున్న సంబంధం గురించి ఈషా మాట్లాడుతూ, "అవును, కొంతకాలం మేమిద్దరం మాట్లాడుకున్నాం. కానీ మేం డేటింగ్ చేస్తున్నామని నేను అనుకోవడం లేదు. కొన్ని నెలల పాటు మా మధ్య సంభాషణలు జరిగాయి. బహుశా ఇది జరుగుతుందేమో, జరగదేమో అన్న దశలో ఉండేవాళ్లం. మేం డేటింగ్ దశకు చేరుకోకముందే అది ముగిసిపోయింది. కాబట్టి దాన్ని డేటింగ్ అని చెప్పలేం. ఒకట్రెండు సార్లు కలిశాం, అంతే. నేను చెప్పినట్లుగా, కొన్ని నెలల పాటు మాట్లాడుకున్నాం, ఆ తర్వాత అది ఆగిపోయింది" అని వివరించారు.

మా మ‌ధ్య మనస్పర్థలు రాలేదు.. కానీ రాసిపెట్టిలేదు అంతే: ఈషా
నిజంగానే వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడే అవకాశం ఉండిందా అని అడిగిన ప్రశ్నకు ఈషా సూటిగా సమాధానమిచ్చారు. "బహుశా జరిగి ఉండేదేమో" అని చెబుతూనే, అనుకున్నంత వేగంగా విషయాలు ముందుకు సాగలేదని తెలిపారు. సమయం, అనుకూలత సరిగ్గా కుదరలేదని ఆమె పంచుకున్నారు. "మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, మనస్పర్థలు కూడా రాలేదు. అది జరగాలని రాసిపెట్టి లేదు అంతే" అని ఆమె ప్రశాంతంగా వెల్లడించారు.

కాఫీ విత్ కరణ్ వివాదం నన్ను ప్రభావితం చేయలేదు: నటి
ఇదిలాఉంటే.. 'కాఫీ విత్ కరణ్' షోలో హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈషా, హార్దిక్‌తో టచ్‌లో లేకపోవడం వల్ల ఆ వివాదం తనను పెద్దగా ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. అయితే, 2019లో ఆ ఎపిసోడ్ ప్రసారమైనప్పుడు, అందులోని మహిళా వ్యతిరేక ధోరణిని బహిరంగంగా విమర్శించిన కొద్దిమంది సెలబ్రిటీలలో ఈషా గుప్తా కూడా ఒకరు కావడం గమనార్హం.

ఇక ఈషా గుప్తా కెరీర్ విషయానికొస్తే, ఆమె చివరిసారిగా బాబీ డియోల్‌తో కలిసి ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోని వెబ్ సిరీస్‌ 'ఏక్ బద్నామ్ ఆశ్రమ్ 3 పార్ట్ 2'లో కనిపించారు. అలాగే 'వన్ డే: జస్టిస్ డెలివర్డ్' చిత్రంలో డీసీపీ లక్ష్మీ రాఠీ పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆమె 'హేరా ఫేరీ 3' మూవీలో న‌టిస్తున్న‌ట్లు వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 


More Telugu News