చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. అనంతపురం జిల్లాలో సిగ్నల్ కట్ చేసి ప్రయాణికుల లూటీ!

  • కోమలి స్టేషన్ దగ్గర సిగ్నల్ కేబుల్ కట్ చేసిన దుండగులు
  • రైలు ఆపి బోగీలోకి చొరబడి ప్రయాణికుల బెదిరింపు
  • నగదు, బంగారు ఆభరణాలు అపహరణ
  • రేణిగుంట రైల్వే పోలీసులకు బాధితుల ఫిర్యాదు
  • ముంబై నుంచి చెన్నై వెళ్తున్న రైలు
ముంబై నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ రైలు ఈ తెల్లవారుజామున భారీ దోపిడీకి గురైంది. అనంతపురం జిల్లా పరిధిలోని తాడిపత్రి పట్టణానికి సమీపంలో ఉన్న కోమలి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పథకం ప్రకారం దుండగులు రైల్వే సిగ్నల్ వ్యవస్థకు చెందిన కేబుల్‌ను కత్తిరించారు. దీంతో సిగ్నల్ అందక రైలు మార్గమధ్యంలోనే నిలిచిపోయింది.

రైలు ఆగిన వెంటనే కొందరు దుండగులు రైలు బోగీల్లోకి ప్రవేశించి ప్రయాణికులను బెదిరించి వారి వద్దనున్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దోపిడీ అనంతరం దుండగులు చీకటిలో పరారయ్యారు.

ఈ దోపిడీ ఘటన అనంతరం బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News