Damascus Church Attack: ప్రార్థనల వేళ రక్తపాతం: డమాస్కస్ చర్చిలో ఆత్మాహుతి దాడి.. 19 మంది మృతి

Damascus Church Attack Suicide Bombing Kills 19
  • ప్రార్థనల సమయంలో చొరబడి కాల్పులు జరిపిన ఉగ్రవాది
  • అనంతరం తనను తాను పేల్చుకున్న దుండగుడు
  • డజన్ల కొద్దీ క్షతగాత్రులు
  • దాడికి పాల్పడింది ఐసిస్ ఉగ్రవాదేనని ధ్రువీకరణ
సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఒక చర్చిలో సోమవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో కనీసం 19 మంది మరణించగా, 53 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.  

డమాస్కస్‌కు తూర్పు శివార్లలోని క్రైస్తవులు అధికంగా నివసించే ద్వెయిలా జిల్లాలోని మార్ ఇలియాస్ చర్చిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, స్థానిక మీడియా కథనాల ప్రకారం పేలుడు ధాటికి చర్చిలోని ప్రార్థనా పీఠాలు రక్తసిక్తమయ్యాయి, పవిత్ర చిత్రాలు ధ్వంసమయ్యాయి, అంతటా భయానక వాతావరణం నెలకొంది.

సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ కథనం ప్రకారం దాడి చేసిన వ్యక్తి మొదట చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తనను తాను పేల్చుకున్నాడు. దీనివల్ల తీవ్ర ప్రాణనష్టం సంభవించిందని సంస్థ తెలిపింది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థకు చెందినవాడని అంతర్గత భద్రతా విభాగం అధికారులు ధ్రువీకరించారు. ఘటన జరిగిన వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, క్షతగాత్రులను డమాస్కస్‌లోని ఆసుపత్రులకు తరలించారు. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న భయాల నేపథ్యంలో ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

డమాస్కస్‌లో ఒక చర్చిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడటం చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ ఘటనతో రాజధానిలో స్లీపర్ సెల్స్ కార్యకలాపాలపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Damascus Church Attack
Syria
ISIS
Islamic State
Terrorist Attack
Church Bombing
Mar Elias Church
Christian Community
Dweilaa district
Syrian Observatory for Human Rights

More Telugu News