రితికకు అలా ప్రపోజ్ చేశా.. రోహిత్ రొమాంటిక్ ప్రపోజల్!

  • భార్య రితిక సజ్‌దేశ్‌కు ప్రేమను వ్యక్తం చేసిన విధానం చెప్పిన రోహిత్
  • తను క్రికెట్ నేర్చుకున్న మైదానంలోనే రితికకు ప్రపోజ్
  • ఐస్‌క్రీమ్ పేరుతో బోరివాలీ గ్రౌండ్‌కు తీసుకెళ్లిన వైనం
  • పిచ్‌పై మోకాళ్లపై కూర్చొని రితికకు తన ఇష్టాన్ని తెలిపిన హిట్‌మ్యాన్‌
భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితిక సజ్‌దేశ్‌కు తాను ప్రేమను వ్యక్తం చేసిన విధానాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తాను క్రికెట్ ఓనమాలు దిద్దిన మైదానంలోనే ఎంతో రొమాంటిక్‌గా రితికకు ప్రపోజ్ చేసినట్లు ఆయన తెలిపాడు. ఆనాటి మధుర జ్ఞాపకాలను రోహిత్ శర్మ గుర్తుచేసుకున్నాడు.

"నేను రితికకు ప్రపోజ్ చేయడానికి ముందు మేమిద్దరం మెరైన్ డ్రైవ్ దగ్గర ఉన్నాం. తను ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చింది. అక్కడే తినేశాం. ఆ తర్వాత కాస్త బోర్‌గా అనిపించడంతో ఐస్‌క్రీమ్ తిందామని రితికతో చెప్పాను. అక్కడి నుంచి కారులో బయలుదేరాం. మేము మెరైన్ డ్రైవ్, హాజి అలీ, వోర్లి దాటుకుంటూ వెళ్తున్నాం. 'ఐస్‌క్రీమ్ షాప్ ఎక్కడ?' అని రితిక అడిగింది. 

నిజానికి బాంద్రా దాటిన తర్వాత ఆమెకు పెద్దగా ఏమీ తెలియదు. నేను బోరివాలీలో ఒక మంచి ఐస్‌క్రీమ్ షాప్ ఉందని, నేనుండేది కూడా అక్కడికి దగ్గరేనని, నువ్వెప్పుడూ ఆ ప్రాంతానికి రాలేదని చెప్పాను. కానీ, నేను తీసుకెళ్తున్నది ఒక మైదానానికి అని రితికకు అప్పటివరకు తెలియ‌దు. మేమిద్దరం నేరుగా పిచ్ దగ్గరకు వెళ్లాం. 

ఆ క్షణాల్ని కెమెరాలో బంధించాలని నేను ముందే నా స్నేహితుడికి చెప్పి ఏర్పాట్లు చేశాను. పిచ్‌పై నేను మోకాలిపై కూర్చొని రితికకు నా ప్రేమను తెలియజేశాను" అని రోహిత్ శర్మ ఆ రొమాంటిక్ సంఘటనను వివరించాడు. అలా తన జీవితంలో క్రికెట్‌కు ఎంత ప్రాముఖ్యత ఉందో, రితికకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పకనే చెప్పినట్లయింది.


More Telugu News