అప్పట్లో మస్క్ ఉద్యోగం కోసం వెళితే... వద్దు పొమ్మన్నారు!

  • 1995లో నెట్‌స్కేప్ కంపెనీలో జాబ్ కు రెజ్యూమే పంపిన ఎలాన్ మస్క్
  • తన రెజ్యూమేను వారు పట్టించుకోలేదన్న మస్క్ 
  • అక్కడ్నించే తన పారిశ్రామిక ప్రస్థానం మొదలైందని వెల్లడి
  • తొలి స్టార్టప్ జిప్‌2ను 300 మిలియన్ డాలర్లకు విక్రయం
  • ఆదాయాన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టిన వైనం
  • ప్రస్తుతం 366 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో ప్రపంచ కుబేరుడు
ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా, టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి దిగ్గజ సంస్థల అధినేతగా వెలుగొందుతున్న ఎలాన్ మస్క్ (Elon Musk), తన పారిశ్రామిక ప్రస్థానం వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను అసలు పారిశ్రామికవేత్త అవ్వాలని అనుకోలేదని, 1995లో నెట్‌స్కేప్ (Netscape) అనే బ్రౌజర్ కంపెనీలో ఉద్యోగం చేయాలని ఆశించానని తెలిపారు. అయితే, వారు తనను తిరస్కరించారని వెల్లడించారు. ఆ కంపెనీ తన దరఖాస్తును పట్టించుకోకపోవడమే, చరిత్రలో అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా తన ప్రస్థానానికి నాంది పలికిందని అన్నారు. ఈ వారం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన వై కాంబినేటర్ (Y Combinator) ఏఐ స్టార్టప్ స్కూల్ కార్యక్రమంలో మస్క్ ఈ విషయాలను వెల్లడించారు.

వై కాంబినేటర్ సీఈఓ గ్యారీ టాన్‌తో జరిగిన ముఖాముఖిలో మస్క్ మాట్లాడుతూ, "నేను నెట్‌స్కేప్‌కు నా రెజ్యూమె పంపాను, కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు" అని తెలిపారు. "అప్పుడు, ఇదేంటి ఇంత దారుణంగా ఉంది అనుకుని, నేనే సొంతంగా సాఫ్ట్‌వేర్ రాసుకుని ఏం జరుగుతుందో చూద్దాం అని నిర్ణయించుకున్నాను" అని ఆయన వివరించారు. మార్క్ ఆండ్రీసెన్‌కు చెందిన ఆనాటి ప్రముఖ బ్రౌజర్ కంపెనీ నెట్‌స్కేప్, మస్క్ దరఖాస్తును పట్టించుకోకపోవడంతో, ఆయన స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను మధ్యలోనే వదిలేసి, సొంత కంపెనీని స్థాపించే దిశగా అడుగులు వేశారు. వార్టన్ నుంచి ఫిజిక్స్, బిజినెస్ డిగ్రీలు పూర్తి చేసి, అప్లైడ్ ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేట్ స్టడీస్ చేస్తున్నప్పటికీ, కంప్యూటర్ సైన్స్ విభాగంలో సరైన అర్హతలు లేవనే కారణంతో నెట్‌స్కేప్ నియామక బృందం ఆయనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.

తిరస్కరణ నుంచి సిరుల పంట: 300 మిలియన్ డాలర్ల విజయం

"ఏం జరుగుతుందో చూద్దాం" అనే దృక్పథంతో మస్క్ ప్రారంభించిన తొలి స్టార్టప్ జిప్‌2 (Zip2). ఆ కంపెనీని నిర్మిస్తున్న సమయంలో ఆయన ఆఫీసులోనే నిద్రపోతూ, సమీపంలోని వైఎంసీఏలో స్నానం చేసేవారని గుర్తుచేసుకున్నారు. ఎన్నో కష్టాలకోర్చి స్థాపించిన జిప్‌2, 1999లో 300 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. దీని ద్వారా మస్క్‌కు 20 మిలియన్ డాలర్లు లభించాయి. అయితే, ఆ డబ్బును సురక్షితంగా దాచుకోకుండా, వెంటనే తన తదుపరి సంస్థ ఎక్స్.కామ్ (X.com) లో పెట్టుబడిగా పెట్టారు. "వచ్చిన లాభాన్ని మళ్ళీ వ్యాపారంలోనే పెట్టాను" అంటూ రిస్క్ తీసుకుంటూ ముందుకు సాగిన తీరును మస్క్ వివరించారు.

ప్రస్తుత దృష్టి, యువతకు సందేశం

ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 366 బిలియన్ డాలర్ల సంపదకు అధిపతి అయిన మస్క్, ఇటీవల ప్రభుత్వ సామర్థ్య కార్యక్రమాలలో తన ప్రమేయాన్ని ఒక 'పక్కదారి' (side quest) గా అభివర్ణించారు. టెక్నాలజీ అభివృద్ధే తన 'ప్రధాన లక్ష్యం' (main quest) అని నొక్కిచెప్పారు. ఇంజనీరింగ్ రంగం సత్యాన్నే కోరుకుంటే, రాజకీయాలు అనవసరపు గందరగోళంతో నిండి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

స్పేస్‌ఎక్స్ (సుమారు 350 బిలియన్ డాలర్ల విలువ), ఎక్స్‌ఏఐ (xAI) వంటి కంపెనీలను నడుపుతున్న ఈ టెస్లా వ్యవస్థాపకుడు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక సులువైన సలహా ఇచ్చారు: "వీలైనంత ఉపయోగకరంగా ఉండటానికి ప్రయత్నించండి! విజయం సాధించడానికి ఏమైనా చేయండి!" అని ఆయన పిలుపునిచ్చారు.


More Telugu News