ఉక్రెయిన్ లోని ఓ అపార్ట్ మెంట్​ ను ఢీ కొట్టిన రష్యా డ్రోన్.. వీడియో ఇదిగో!

  • కెనడాలో జీ7 సమావేశాల వేళ కీవ్‌లో విధ్వంసం
  • 14 మంది దుర్మరణం.. 44 మందికి గాయాలు
  • మృతుల్లో ఒక అమెరికా పౌరుడు ఉన్నట్లు నిర్ధారణ
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 14 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ప్రపంచ దేశాల అధినేతలు కెనడాలో జీ7 సమావేశాలకు హాజరవుతున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఈ సమావేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ కూడా హాజరుకానున్నారు.

ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇగోర్ క్లెమెంకో మాట్లాడుతూ.. రాజధానిలోని వివిధ జిల్లాల్లో 27 ప్రాంతాలపై శత్రువులు దాడులకు పాల్పడినట్లు తెలిపారు. "నివాస భవనాలు, విద్యా సంస్థలు, కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి" అని ఆయన పేర్కొన్నారు. ఒకే నివాస సముదాయంలో 30 అపార్ట్‌మెంట్‌లు ధ్వంసమయ్యాయని ఆయన వివరించారు. "కీవ్‌లో మృతుల సంఖ్య 14కు పెరిగింది. ఇప్పటివరకు 44 మంది గాయపడ్డారు" అని క్లెమెంకో తెలిపారు. ఒడెస్సాలో ఆరుగురు, చెర్నిగివ్‌లో మరొకరు గాయపడినట్లు మంత్రి సమాచారం ఇచ్చారు.

అపార్ట్ మెంట్ పై దాడి..
ఈ రోజు ఉదయం కీవ్‌లోని ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై షాహెద్ తరహా డ్రోన్ నేరుగా దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి. నగరంలోని సోలోమియాన్‌స్కీ జిల్లాలో జరిగిన రష్యా దాడిలో 62 ఏళ్ల అమెరికా పౌరుడు మరణించినట్లు కీవ్ మేయర్ విటాలీ క్లిచ్‌కో టెలిగ్రామ్‌లో తెలిపారు. గాయపడిన వారికి వైద్య సిబ్బంది సహాయం అందిస్తున్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఈ అమెరికన్ పౌరుడు మృతి చెందినట్లు ఆయన చెప్పారు. మృతులు, గాయపడిన వారిలో ఎక్కువమంది స్వియాటోషిన్‌స్కీ, సోలోమియాన్‌స్కీ జిల్లాలకు చెందినవారని తెలిసింది. ఉక్రెయిన్ వాయు రక్షణ దళాలు కూల్చివేసిన డ్రోన్ల శకలాలు పడటం వల్ల మరో రెండు జిల్లాల్లో మంటలు చెలరేగాయని క్లిచ్‌కో అన్నారు.


More Telugu News