ఏడాదికి 100 అణ్వాయుధాలు పోగేస్తున్న చైనా.. భారత్ కంటే మూడింతలకు పైగా వార్‌హెడ్‌లు!

  • శరవేగంగా విస్తరిస్తున్న చైనా అణ్వాయుధ సంపత్తి
  • ప్రతిఏటా 100 కొత్త అణు వార్‌హెడ్‌లను సమకూర్చుకుంటున్న చైనా
  • భారత్ వద్ద 180, పాకిస్థాన్ వద్ద 170 అణు వార్‌హెడ్‌లు!
  • పాకిస్థాన్‌పై అణ్వస్త్రాల విషయంలో భారత్ స్వల్ప ఆధిక్యత
  • భారత్, పాక్‌లు అధునాతన అణు ప్రయోగ వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి
చైనా తన అణ్వాయుధ సంపత్తిని ప్రమాదకర స్థాయిలో వేగంగా విస్తరించుకుంటోందని అంతర్జాతీయ ఆయుధ పర్యవేక్షణ సంస్థ ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‘ (సిప్రి) తన తాజా నివేదికలో వెల్లడించింది. పాకిస్థాన్‌పై భారత్ స్వల్ప ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఇరు దేశాల మధ్య ఇటీవల చోటుచేసుకున్న సైనిక ఘర్షణలు అణు సంక్షోభానికి దారితీసే ప్రమాదాన్ని సృష్టించాయని సిప్రి హెచ్చరించింది.

సిప్రి నిన్న విడుదల చేసిన నివేదిక ప్రకారం చైనా వద్ద ప్రస్తుతం 600 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. జనవరి 2024 నాటికి ఈ సంఖ్య 500గా ఉండగా, కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే మరో 100 వార్‌హెడ్‌లను చైనా సమకూర్చుకుంది. ఇదే సమయంలో భారత్ వద్ద 180, పాకిస్థాన్ వద్ద 170 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని సిప్రి అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం అణ్వాయుధాల్లో 90 శాతం రష్యా, అమెరికాల వద్దే ఉన్నాయని నివేదిక గుర్తుచేసింది.

మే 7న పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రస్తావిస్తూ సిప్రి సీనియర్ పరిశోధకుడు ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. "అణు సంబంధిత సైనిక మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం, దీనికి తోడు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం వంటివి సంప్రదాయ సైనిక ఘర్షణను అణు సంక్షోభంగా మార్చే ప్రమాదం ఏర్పడింది" అని పేర్కొన్నారు. అయితే, భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్‌తో సహా పలువురు భారత అధికారులు మాత్రం మే 7-10 మధ్య జరిగిన ఘర్షణలు ఏ దశలోనూ అణ్వాయుధాల వినియోగం వైపునకు వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆ సమయంలో భారత్, పాకిస్థాన్‌లోని సర్దోధా, నూర్‌ఖాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని, ఇది స్పష్టమైన వ్యూహాత్మక సందేశమని నివేదిక పేర్కొంది. సర్దోధా వైమానిక స్థావరం కిరాణా హిల్స్‌లోని పాకిస్థాన్ భూగర్భ అణు కేంద్రాలు, నిల్వ కేంద్రాలకు సమీపంలో ఉండగా, నూర్ ఖాన్ స్థావరం పాక్ అణు కార్యక్రమాలను పర్యవేక్షించే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ ప్రధాన కార్యాలయానికి దగ్గరగా ఉంది.

చైనా అణ్వాయుధ సంపత్తి వేగంగా పెరుగుతోందని, 2035 నాటికి చైనా వద్ద 1,500 అణు వార్‌హెడ్‌లు ఉండవచ్చని సిప్రి నివేదిక అంచనా వేసింది. భారత్, పాకిస్థాన్‌లు రెండూ 2024లో కొత్త రకం అణు ప్రయోగ వ్యవస్థలను అభివృద్ధి చేస్తూనే ఉన్నాయని, బాలిస్టిక్ క్షిపణులపై బహుళ వార్‌హెడ్‌లను మోహరించే సామర్థ్యం కోసం ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. భారత్ తన అణు వార్‌హెడ్‌ల సంఖ్యను గత ఏడాది 172 నుంచి 180కి పెంచుకుందని, కొత్త ‘క్యానిస్టరైజ్డ్’ క్షిపణుల ద్వారా శాంతి సమయంలో కూడా అణు వార్‌హెడ్‌లను అనుసంధానించి ఉంచే సామర్థ్యాన్ని భారత్ పొందిందని నివేదిక తెలిపింది.

మరోవైపు, పాకిస్థాన్ కూడా విమానాలు, భూమి నుంచి ప్రయోగించే బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, అగోస్టా-90బి డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములపై అమర్చే బాబర్-3 వంటి సముద్రం నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులతో కూడిన తన అణు త్రయాన్ని ప్రాథమిక దశలో అభివృద్ధి చేస్తోందని సిప్రి నివేదిక పేర్కొంది. భారత్ ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ అనే రెండు కార్యాచరణ అణు జలాంతర్గాములతో (అణ్వస్త్రాలను మోసుకెళ్లగల అణు జలాంతర్గాములు) పరిణితి చెందిన అణు త్రయాన్ని కలిగి ఉంది. ఈ ఏడాది ఐఎన్ఎస్ అరిధామన్ అనే కొంచెం పెద్దదైన మూడో అణు జలాంతర్గామిని కమిషన్ చేయనున్నట్లు సమాచారం.

అణ్వాయుధాలు ఏ దేశం వద్ద ఎన్ని?
రష్యా - 4,3900
అమెరికా -  3,700
చైనా -  600
ఫ్రాన్స్ -  290
యూకే -  225
ఇండియా -  180
పాకిస్థాన్ -  170
ఇజ్రాయెల్ -  90
ఉత్తర కొరియా -  50


More Telugu News