అమెరికా క్రికెట్ లీగ్ లో ఆడుతున్న బాలీవుడ్ దర్శకుడి కుమారుడు... ఎందుకంటే...!

  • ప్రముఖ ఫిల్మ్‌మేకర్ విధు వినోద్ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా
  • అమెరికా మేజర్ లీగ్ క్రికెట్‌లో ఎంఐ న్యూయార్క్ జట్టుకు ప్రాతినిధ్యం
  • భారత పాస్‌పోర్ట్ లేకపోవడంతో విదేశీ లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ మినహాయింపు
  • ఐపీఎల్‌లో అవకాశం వస్తే భారత పౌరసత్వం తీసుకునేవాడినని గతంలో వెల్లడి
  • రంజీ ట్రోఫీలో మిజోరం తరఫున అద్భుత ప్రదర్శన చేసిన 26 ఏళ్ల అగ్ని
ప్రముఖ భారతీయ చలనచిత్ర దర్శకనిర్మాత విధు వినోద్ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సి)లో ఎంఐ న్యూయార్క్ జట్టు తరఫున ఆడుతున్నాడు. 26 ఏళ్ల అగ్ని, గతంలో 2024-25 రంజీ ట్రోఫీ సీజన్‌లో సహా భారత దేశవాళీ క్రికెట్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో, అతడు విదేశీ లీగ్‌లో ఆడటం చాలా మంది అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యాక్టివ్ క్రికెటర్లను విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతించదు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లేదా ప్రత్యేక నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పొందిన తర్వాత మాత్రమే ఇందుకు అవకాశం ఉంటుంది.

అయితే, అగ్ని చోప్రా విషయంలో ఈ నిబంధన వర్తించకపోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అతడి వద్ద భారతీయ పాస్‌పోర్ట్ లేదు. అగ్ని అమెరికాలోని మిచిగాన్‌లో జన్మించాడు. ఈ కారణంగా, విదేశీ క్రికెట్ లీగ్‌లలో పాల్గొనే విషయంలో బిసీసీఐ నిబంధనల నుంచి అతడికి మినహాయింపు లభించింది. అయితే, బిసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం, అతడు భారత పౌరసత్వం పొందితే తప్ప మళ్లీ భారత దేశవాళీ లీగ్‌లలో ఆడటానికి వీలుండదు.

గతంలో భారత దేశవాళీ క్రికెట్‌లో అగ్ని చోప్రా విశేష ప్రతిభ కనబరిచాడు. 2023-24 రంజీ సీజన్‌లో మిజోరం జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు, తాను ఆడిన తొలి నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలోనూ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అప్పట్లో అతడి ప్రదర్శన క్రికెట్ పండితుల ప్రశంసలు అందుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడే అవకాశం వస్తే, తాను భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని ఇక్కడే ఉండిపోయేవాడినని అగ్ని గతంలో ఒక సందర్భంలో తెలిపాడు. ఐపీఎల్‌లో ఆడాలనే తన కోరికను పలుమార్లు వ్యక్తం చేసినప్పటికీ, ఏ ఫ్రాంచైజీ కూడా అగ్నిని ఎంపిక చేసుకోలేదు. ఈ క్రమంలోనే అతడు అమెరికా ఆధారిత లీగ్‌లో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. "ఒకవేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఎంపికైతే, నేను భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని ఉండేవాడిని. కానీ ఇప్పుడు అమెరికాలో నా టైమ్ కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.


More Telugu News