భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

  • 677 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 227 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.04
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, మన మార్కెట్లు రాణించడం గమనార్హం. ముఖ్యంగా ఐటీ, మెటల్, రియల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీల పెరుగుదలకు దోహదపడింది.

ఈ ఉదయం సెన్సెక్స్ 81,034 పాయింట్ల వద్ద కొంత నష్టంతో ప్రారంభమైంది. అయితే, కొద్దిసేపటికే కోలుకుని రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,865 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్, చివరికి 677 పాయింట్ల లాభంతో 81,796 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 227 పాయింట్లు లాభపడి 24,946 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.04గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, ఎటర్నల్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 73 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర 3435 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 


More Telugu News