అర్ధరాత్రి ఫోన్‌తో షార్‌లో టెన్షన్.. చివరకు ఊపిరి పీల్చుకున్న అధికారులు!

  • శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌కు బాంబు బెదిరింపు
  • షార్‌లో తీవ్రవాదులున్నారంటూ తమిళనాడు కంట్రోల్ రూమ్‌కు అర్ధరాత్రి ఫోన్
  • అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఈ తెల్లవారుజాము నుంచి తనిఖీలు
  • సీఐఎస్‌ఎఫ్, పోలీసు బలగాలు, తీర రక్షక దళం విస్తృత గాలింపు
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో బాంబు ఉందన్న బెదిరింపుతో కలకలం రేగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. చివరికి దీనిని ఆకతాయిల పనిగా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గత అర్ధరాత్రి సమయంలో తమిళనాడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కొన్ని ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. శ్రీహరికోటలోని షార్ ప్రాంగణంలో తీవ్రవాదులు ఉన్నారని, వారు దాడులకు పాల్పడవచ్చని హెచ్చరించారు. దీంతో వెంటనే షార్‌లోని భద్రతా అధికారులు, స్థానిక పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి.

షార్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) బృందాలు, స్థానిక పోలీసు బలగాలు ఈ తనిఖీల్లో పాలుపంచుకున్నాయి. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో పోలీసులు షార్‌లోకి దారితీసే అన్ని మార్గాల్లోనూ, అనుమానిత ప్రదేశాల్లోనూ గాలింపు చర్యలు చేపట్టారు. సముద్ర మార్గం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీరప్రాంత రక్షణ దళాలు కూడా అప్రమత్తమై సముద్ర తీరంలో గస్తీ నిర్వహించాయి. షార్‌లోని అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు.

గంటల తరబడి సాగిన విస్తృత తనిఖీల అనంతరం ఈ బెదిరింపు ఫోన్‌ కాల్స్‌‌ను  ఆకతాయిల పనిగా భద్రతా బలగాలు నిర్ధారించాయి. ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బెదిరింపు కాల్స్ చేసిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News