ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఫ్లైట్ యూటర్న్.. ఏం జరిగింది?

  • బాంబు బెదిరింపే కారణమని సమాచారం
  • రెండు గంటల ప్రయాణం తర్వాత విమానం వెనక్కి
  • ల్యాండింగ్ అనుమతి లభించకపోవడమే కారణమన్న సంస్థ
  • ప్రయాణికులకు రాత్రి బస, నేడు ఉదయం తిరిగి బయలుదేరనున్న విమానం
హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా విమానం అనూహ్యంగా వెనుదిరిగింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎల్‌హెచ్752 విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే వెనక్కి వెళ్లి, తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే నిన్న సాయంత్రం ల్యాండ్ అయింది. ఈ ఘటనకు బాంబు బెదిరింపు కారణమని కొన్ని వర్గాలు చెబుతుండగా, ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడమే కారణమని లుఫ్తాన్సా సంస్థ పేర్కొంది.

లుఫ్తాన్సా విమానం స్థానిక కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 2:14 గంటలకు ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ విమానం ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, విమానం గాల్లోకి లేచిన సుమారు రెండు గంటల తర్వాత బాంబు బెదిరింపు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు సమాచారం.

అయితే, లుఫ్తాన్సా సంస్థ ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో ఈ వార్తలను ఖండించింది. హైదరాబాద్‌లో విమానం ల్యాండ్ అవడానికి అనుమతి లభించకపోవడంతోనే వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్ లైవ్ ఫ్లైట్ ట్రాకర్ ప్రకారం విమానం నిన్న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది.

హైదరాబాద్‌లోని తన తల్లిని కలిసేందుకు వస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు మాట్లాడుతూ హైదరాబాద్‌లో విమానం ల్యాండ్ చేయడానికి అనుమతి రాలేదని తమకు చెప్పారని, సోమవారం ఉదయం 10 గంటలకు ఇదే విమానంలో మళ్లీ బయలుదేరుతామని పేర్కొన్నారని పీటీఐ వార్తా సంస్థకు వివరించారు. ప్రయాణికులందరికీ రాత్రి బస ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. 


More Telugu News