Donald Trump: మేం రంగంలోకి దిగితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది.. ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

Donald Trump Warns Iran After Israel Strikes
  • ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదన్న అమెరికా అధ్యక్షుడు
  • తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ కు వార్నింగ్
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలపై ఇజ్రాయెల్ భారీ ఎత్తున విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తోంది. ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణులతో ప్రతిదాడులు చేస్తోంది. రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఇరాన్ పై నిన్న రాత్రి జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ "భారీ దాడులు" చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పారు. ఒకవేళ అమెరికాపై ఇరాన్ దాడికి ప్రయత్నిస్తే, తమ సాయుధ బలగాల పూర్తి శక్తితో ఇరాన్ మునుపెన్నడూ చూడని స్థాయిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

"రాత్రి ఇరాన్‌పై జరిగిన దాడితో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు. ఇరాన్ మమ్మల్ని ఏ రూపంలోనైనా లక్ష్యంగా చేసుకుంటే, అమెరికా సాయుధ దళాల పూర్తి శక్తి ఏంటో చూపిస్తాం" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాను సులభంగా ఒక ఒప్పందం కుదిర్చి, ఈ రక్తపాత ఘర్షణకు ముగింపు పలకగలనని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ పై దాడుల నేపథ్యంలో ఈ రోజు ఒమన్‌లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ అణు చర్చలు రద్దయ్యాయి. ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే ఏమీ మిగలదని ట్రంప్ ఇటీవల హితవు పలికారు.

మరోవైపు, ఇరాన్ ప్రభుత్వ అణు ఆయుధాల ప్రాజెక్టుకు సంబంధించిన టెహ్రాన్‌లోని లక్ష్యాలపై తాము విస్తృతమైన దాడులు పూర్తి చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఈ రోజు తెల్లవారుజామున ప్రకటించింది. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, ఎస్‌పీఎన్‌డీ అణు ప్రాజెక్టు లక్ష్యాలలో ఉన్నాయని ఎక్స్ లో పేర్కొంది. ఇరాన్ తన "అణు ఆర్కైవ్‌ను దాచిన" ప్రదేశాన్ని కూడా తాము దెబ్బతీశామని ఐడీఎఫ్ తెలిపింది.

ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో జెరూసలెం, టెల్ అవీవ్‌లలో వైమానిక దాడుల సైరన్లు మోగాయి. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలు, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 10 ఏళ్ల బాలుడు, 20 ఏళ్ల యువతితో సహా కనీసం ఏడుగురు మరణించినట్లు సమాచారం.
Donald Trump
Iran
Israel
nuclear program
airstrikes
Middle East tensions
US foreign policy
Iran nuclear deal
Israel Defense Forces
Jerusalem

More Telugu News