దుబాయ్‌‌లో 67 అంతస్తుల భవనంలో మంటలు.. గంటల పాటు శ్రమించి వేలాదిమంది తరలింపు

  • దుబాయ్‌లోని టైగర్‌ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం
  • 67 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు
  • 764 ఫ్లాట్ల నుండి 3,820 మందిని సురక్షితంగా ఖాళీ చేయించిన అధికారులు
  • దాదాపు 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది
  • నివాసితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటన
దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని ప్రఖ్యాత 'టైగర్‌ టవర్‌'గా పిలువబడే 67 అంతస్తుల 'మెరీనా పినాకిల్‌' నివాస భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భవనంలోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

దుబాయ్‌ మీడియా కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. భవనంలోని 764 ఫ్లాట్‌లలో నివసిస్తున్న సుమారు 3,820 మందిని అత్యంత వేగంగా, సురక్షితంగా బయటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు ఆరు గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రమాద స్థలంలో అంబులెన్సులు, వైద్య సిబ్బందిని కూడా మోహరించారు.

అదృష్టవశాత్తూ ఈ భారీ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అధికారులు, నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. నిరాశ్రయులైన వారికి తాత్కాలిక వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దుబాయ్‌ మీడియా కార్యాలయం (డీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది.




More Telugu News