తప్పుడు మ్యాప్‌తో ఇజ్రాయెల్ సైన్యం వివాదాస్పద పోస్ట్.. భారతీయుల ఆగ్రహం.. చివరికి క్షమాపణ!

  • సోషల్ మీడియాలో భారత్ తప్పుడు మ్యాప్ పోస్ట్ చేసిన ఐడీఎఫ్
  • జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపడంతో భారతీయుల తీవ్ర ఆగ్రహం
  • ఇరాన్ క్షిపణుల వ్యాప్తిని వివరిస్తూ ఐడీఎఫ్ చేసిన పోస్టులో ఈ ఘోర తప్పిదం
  • వెల్లువెత్తిన విమర్శలతో దిగొచ్చిన ఇజాయెల్ సైన్యం.. తప్పును అంగీకరించి క్షమాపణ
  • కొద్ది నెలల వ్యవధిలో ఇజ్రాయెల్ ఇలాంటి తప్పు చేయడం ఇది రెండోసారి
ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) నిన్న‌ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక మ్యాప్ తీవ్ర దౌత్యపరమైన దుమారానికి కారణమైంది. ఇరాన్ క్షిపణుల ప్రపంచవ్యాప్త పరిధిని హైలైట్ చేస్తూ పెట్టిన పోస్టులో జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా తప్పుగా చూపించడంతో భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేప‌థ్యంలో వెల్లువెత్తిన విమర్శలతో ఐడీఎఫ్ ఆ పోస్టుపై వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పింది.

వివరాల్లోకి వెళితే... ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రాంతీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరింది. ఈ తరుణంలో ఇరాన్ సైనిక, అణు స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ క్షిపణుల సామర్థ్యాన్ని వివరిస్తూ ఐడీఎఫ్ ఒక మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఈ మ్యాప్‌లో భారత్‌లోని అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో ఉన్నట్లుగా చూపించారు.

ఈ పొరపాటును భారతీయ నెటిజన్లు వెంటనే గుర్తించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఐడీఎఫ్ అగౌరవపరిచిందని ఆరోపిస్తూ, వెంటనే తప్పును సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. "దౌత్య సంబంధాలలో ఎవరూ నిజమైన స్నేహితులు కారని ఇప్పుడు అర్థమవుతోంది. అందుకే భారత్ తటస్థంగా ఉంటుంది" వంటి వ్యాఖ్యలతో కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ అధికారిక విభాగాల నుంచి ఇలాంటి మ్యాప్ తప్పిదం రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చడానికి ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ఒక కారణం. ఇరాన్ నుంచి తమకు భద్రతాపరమైన ముప్పు ఉందని ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను సమర్థించుకుంటున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో సంభాషించారు. 

ఈ సందర్భంగా పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొల్పాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ఇలాంటి కీలక సమయంలో ఈ మ్యాప్ వివాదం చోటుచేసుకోవడం భారత్-ఇజ్రాయెల్ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలపై నీలినీడలు కమ్మేలా చేసింది.

ఐడీఎఫ్ క్షమాపణ
ఇక‌, త‌ప్పుడు మ్యాప్ విష‌యమై పెల్లుబికిన వ్యతిరేకత నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెంటనే స్పందించాయి. తాము పోస్ట్ చేసిన మ్యాప్‌పై వివరణ ఇస్తూ క్షమాపణలు తెలిపాయి. "ఈ పోస్ట్ కేవలం ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక ఉదాహరణ మాత్రమే. ఈ మ్యాప్ సరిహద్దులను కచ్చితంగా చూపించడంలో విఫలమైంది. ఈ చిత్రం వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే మన్నించండి" అని ఐడీఎఫ్ తమ తాజా సోష‌ల్ మీడియా పోస్టులో పేర్కొంది.




More Telugu News