భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్ ఎగుమతులు భారీగా పెంచేసిన యాపిల్

Apple Increases iPhone Exports from India to USA
షార్ట్స్‌లో చూడండి
అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, ప్రపంచ సరఫరా గొలుసు సమీకరణాల్లో కీలక మార్పులకు దారితీస్తోంది. చైనా ఉత్పత్తులపై అగ్రరాజ్యం విధించిన భారీ సుంకాల సెగ, ఇప్పుడు ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ను తాకింది. ఈ పరిణామాల నేపథ్యంలో, యాపిల్ సంస్థ తన ఉత్పత్తి వ్యూహంలో కీలక మార్పులు చేస్తూ, అమెరికాకు 'మేడ్ ఇన్ ఇండియా' ఐఫోన్లను భారీగా ఎగుమతి చేస్తోంది. చైనాకు ఇది ఒకరకంగా గట్టి దెబ్బేనని చెప్పాలి.

అమెరికా మార్కెట్‌కు భారత ఐఫోన్ల జోరు

గతంలో భారత్ లో తయారైన ఐఫోన్లను యాపిల్ సంస్థ నెదర్లాండ్స్, యూకే వంటి ఐరోపా దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసేది. ఇప్పుడు చైనాపై అమెరికా టారిఫ్ లు పెంచడంతో యాపిల్ కూడా అందుకు అనుగుణంగా ప్లాన్ మార్చింది. భారత్ లో తయారైన ఐఫోన్లను అమెరికాకు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తోంది.

గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మార్చి నుంచి మే నెల మధ్య భారత్ నుంచి ఎగుమతి అయిన మొత్తం ఐఫోన్లలో ఏకంగా 97 శాతం అమెరికా గడ్డపైనే అడుగుపెట్టడం గమనార్హం. దీని విలువ సుమారు 3.2 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 26,600 కోట్లు). ప్రత్యేకించి మార్చి నెలలో 1.3 బిలియన్ డాలర్లు, మే నెలలో 1 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఐఫోన్లు అమెరికాకు చేరాయి.

ఈ దూకుడు ఇంతటితో ఆగలేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే (జనవరి-మే) అమెరికాకు జరిగిన ఐఫోన్ల ఎగుమతుల విలువ 4.4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 36,600 కోట్లు) చేరింది. ఇది గత ఏడాది (2024) మొత్తం ఎగుమతులైన 3.7 బిలియన్ డాలర్ల రికార్డును ఇప్పటికే అధిగమించడం, పరిస్థితి తీవ్రతకు, యాపిల్ వ్యూహాత్మక మార్పుకు అద్దం పడుతోంది. చైనా నుంచి దిగుమతి అయ్యే ఐఫోన్లపై అధిక సుంకాల భారం పడుతుండటంతో, యాపిల్ ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది.

'మేక్ ఇన్ ఇండియా'కు మరింత ఊతం

చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న యాపిల్ వ్యూహం, భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి భారీ ఊతమిస్తోందని పారిశ్రామిక వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది భారతదేశాన్ని కీలకమైన గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే దిశగా సాగుతున్న ప్రయత్నాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

సుంకాలపై చర్చలు

అయితే, భారత ఐఫోన్లపైనా అమెరికా కొన్ని సుంకాలను విధిస్తోంది. ప్రస్తుతం 26 శాతం అదనపు సుంకాన్ని జులై 9 వరకు తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, 10 శాతం మూల సుంకం (బేస్‌లైన్ టారిఫ్) యథాతథంగా కొనసాగుతోంది. ఈ 90 రోజుల ఉపశమన కాలాన్ని సద్వినియోగం చేసుకొని, సుంకాల భారాన్ని పూర్తిగా తొలగించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో, అమెరికా-చైనాలు కూడా పరస్పర సుంకాలను తగ్గించుకునే దిశగా సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Go Back to Shorts
Apple
iPhone exports
India
USA
Make in India
China trade war
tariffs
global manufacturing
supply chain
technology

More Telugu News