రూమర్లకు చెక్.. త్రివిక్ర‌మ్ తదుపరి సినిమాల‌పై నిర్మాత నాగవంశీ క్లారిటీ

  • ఎన్టీఆర్, వెంకటేశ్‌లతో మాత్ర‌మే గురూజీ చిత్రాలు 
  • మిగతా వార్తలన్నీ వదంతులేనని కొట్టిపారేసిన నాగవంశీ
  • ఎదైనా ప్రాజెక్ట్ ఒప్పుకుంటే తానే స్వ‌యంగా వెల్ల‌డిస్తాన‌న్న నిర్మాత‌
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేపట్టబోయే తదుపరి చిత్రాలపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ త‌దిత‌ర స్టార్ల పేర్లు వినిపించాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ నిర్మాత నాగవంశీ తాజాగా స్పష్టమైన ప్రకటన చేశారు.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ లైనప్‌పై వస్తున్న ఇతర కథనాలపై నిర్మాత నాగవంశీ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ద్వారా స్పందించారు. "త్రివిక్రమ్ గారి తదుపరి రెండు ప్రాజెక్టులు వెంకటేశ్‌, జూనియర్ ఎన్టీఆర్ అన్నతో ఖరారయ్యాయి. మిగిలినవన్నీ కేవలం ఊహాగానాలే. త్రివిక్రమ్ గారి ఏ ప్రాజెక్ట్ ఖరారైనా నేనే అధికారికంగా ప్రకటిస్తాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ ప్రకటనతో త్రివిక్రమ్ ముందుగా వెంకటేశ్‌తో ఒక సినిమా పూర్తి చేసి, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో పౌరాణిక చిత్రాన్ని ప్రారంభిస్తారని స్పష్టమైంది. దీంతో ఇతర హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేయనున్నారంటూ వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని తేలిపోయింది. మరిన్ని అధికారిక వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

ఇక‌, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో తార‌క్‌ కథానాయకుడిగా ఓ సోషియో-మైథలాజికల్ ఫాంటసీ చిత్రం రూపుదిద్దుకోనుందని స‌మాచారం. పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్ నటించనుండటం ఇదే తొలిసారి కావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. 


More Telugu News