జగన్, భారతి వల్లే దరిద్రం పట్టింది: కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

  • అమరావతి మహిళలపై సాక్షి యాంకర్ల వ్యాఖ్యలు దుర్మార్గమన్న ఆదినారాయణరెడ్డి
  • జగన్, భారతి కుట్రపన్ని అమరావతిని దెబ్బతీశారని ఆరోపణ
  • కొమ్మినేని, కృష్ణంరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందన్న ఎమ్మెల్యే
  • మద్యం కేసులో జగన్ జైలుకెళ్లడం ఖాయమన్న ఆదినారాయణరెడ్డి
  • వైకాపా నేతలు కూడా జైలు శిక్ష అనుభవిస్తారని జోస్యం
రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి ఛానల్ యాంకర్లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డి కుట్రపూరితంగానే అమరావతిని దెబ్బతీయాలని, అక్కడ చిచ్చుపెట్టాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.

బుధవారం కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులు చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.

"జగన్, భారతి వల్లే రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. అంతేకాకుండా, గత ఐదేళ్ల వైకాపా పాలనలో అక్రమాలకు పాల్పడిన అనేక మంది నాయకులు కూడా త్వరలోనే జైలు ఊచలు లెక్కపెడతారని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "కన్నతల్లిని, చెల్లిని దూరం పెట్టిన జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారా?" అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగించారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఏర్పాటైన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వికాసం దిశగా అడుగులు వేస్తుంటే, వైకాపా నేతలు ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు.


More Telugu News