‘వార్ 2’ సినిమాకు డబ్బింగ్ ప్రారంభించిన ఎన్టీఆర్

  • డబ్బింగ్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న యష్ రాజ్ ఫిల్మ్స్
  • హృతిక్ రోషన్, తార‌క్‌ నటిస్తున్న భారీ చిత్రం
  • అయాన్ ముఖర్జీ దర్శకత్వం.. ఆదిత్య చోప్రా నిర్మాత
  • క‌థానాయిక‌గా కియారా అద్వానీ... ఆగస్టు 14న మూవీ విడుదల
యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ తన తదుపరి భారీ చిత్రం ‘వార్ 2’ కోసం డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ‘వార్ 2’ చిత్రం ఈ ఏడాది రాబోయే క్రేజీ ప్రాజెక్టుల‌లో ఒకటిగా ఉన్న విష‌యం తెలిసిందే. 

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ‘ఏజెంట్ కబీర్’ పాత్రను కొనసాగిస్తుండగా, తార‌క్ శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఎన్టీఆర్ నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో ముఖ్యంగా దక్షిణాది ప్రేక్షకులతో పాటు పాన్-ఇండియా సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో హృతిక్ రోషన్ పాత్ర "సిద్ధంగా ఉండు. దయకు తావులేదు. నరకానికి స్వాగతం. లవ్, కబీర్" అంటూ చెప్పే డైలాగ్ వీరిద్దరి మధ్య భీకరమైన పోరును తెలియ‌జేసింది.

అయితే, ఈ టీజర్‌పై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. సినిమా స్థాయి, తారాగణంపై ప్రశంసలు వెల్లువెత్తినప్పటికీ, కొందరు మాత్రం మొదటి ‘వార్’ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ పునరావృతమవుతున్నాయేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా హృతిక్ రోషన్, తార‌క్‌ మధ్య పోరును వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘వార్ 2’ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. భారీ తారాగణం, అంతర్జాతీయ లొకేషన్లు, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా భారతీయ యాక్షన్ చిత్రాల జాబితాలో ఓ మైలురాయిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.




More Telugu News