Alexander Laloo Hek: హనీమూన్ మర్డర్ కేసుతో మేఘాలయకు చెడ్డపేరు.. బాధిత కుటుంబాలపై ఆ రాష్ట్ర మంత్రి ఆగ్రహం

- మా రాష్ట్రం పరువు తీశారు.. క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం దావా వేస్తామని వార్నింగ్
- నిందితులను మేఘాలయకు తీసుకొస్తామని మంత్రి స్పష్టీకరణ
- కేసు దర్యాప్తును ఏ ఏజెన్సీకి అప్పగించినా అభ్యంతరం లేదని వెల్లడి
హనీమూన్ మర్డర్ కేసుపై మేఘాలయ మంత్రి అలెగ్జాండర్ లాలూ హెక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన ద్వారా మేఘాలయ రాష్ట్ర ప్రతిష్టకు, ప్రజల పరువుకు భంగం కలిగించారని ఆయన ఆరోపించారు. హత్యకు గురైన రాజా రఘువంశీ, నిందితురాలు సోనమ్ కుటుంబాలపై పరువునష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. ఆ రెండు కుటుంబాలు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి అలెగ్జాండర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"మేఘాలయ రాష్ట్రం, ఇక్కడి ప్రజల పరువు తీసినందుకు సోనమ్, రాజా రఘువంశీల కుటుంబాల నుంచి మేము క్షమాపణ కోరుతున్నాము. వారు దీనికి అంగీకరించకపోతే పరువు నష్టం కేసు దాఖలు చేస్తాము" అని మంత్రి హెచ్చరించారు. కేసు దర్యాప్తు గురించి ప్రస్తావిస్తూ, "హత్య జరిగింది ఇక్కడే కాబట్టి నిందితులను ఇక్కడికే తీసుకువస్తాము. ఈ కేసును మా పోలీసులు విచారిస్తారు. ఒకవేళ సీబీఐకి లేదా మరేదైనా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామన్నా మాకు అభ్యంతరం లేదు" అని మంత్రి అలెగ్జాండర్ స్పష్టం చేశారు.