YS Sharmila: రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు: షర్మిల ఆవేదన

- సీఎం చంద్రబాబుకు మద్దతిస్తున్నారన్న రోజా వ్యాఖ్యలపై షర్మిల ఆగ్రహం
- రోజా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన పీసీసీ చీఫ్
- తనకు, విజయమ్మకు వైకాపా అక్రమ సంబంధాలు అంటగట్టిందని ఆవేదన
- రక్త సంబంధమే తనపై విష ప్రచారం చేసిందని వ్యాఖ్య
- విజయమ్మను పార్టీ నుంచి పంపినప్పుడే వైసీపీ పతనం మొదలైందని విమర్శ
- రాష్ట్ర సమస్యలపై పోరాటాలకే తన మద్దతు ఉంటుందని స్పష్టం
సీఎం చంద్రబాబుకు తాను మద్దతు పలుకుతున్నానంటూ వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, రోజాపై నిప్పులు చెరిగారు. రోజా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వైసీపీ నేతలు తనపై, తన తల్లి విజయమ్మపై గతంలో చేసిన దారుణమైన ప్రచారాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు.
"రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు. నా రక్త సంబంధమే నా మీద విష ప్రచారం చేసింది. నేను వైఎస్సార్‌కే పుట్టలేదని దారుణంగా ప్రచారం చేశారు. విజయమ్మకు నేను అక్రమ సంతానం అని కూడా ప్రచారం చేశారు. మీరు చేసిన ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల వల్ల నేను ఎంతగా మానసిక క్షోభ అనుభవించి ఉంటానో ఆలోచించండి" అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తన సోదరుడు కష్టాల్లో ఉన్నారని తెలియగానే, రక్త సంబంధానికి విలువ ఇచ్చి 3,200 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశానని షర్మిల గుర్తుచేశారు. "మీరు మనుషులు కాదు. రక్త సంబంధం గురించి మాట్లాడటానికి మీకు సిగ్గుండాలి. విజయమ్మను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే మీ పతనానికి పునాది పడింది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని కోరుతున్నాను" అని వైసీపీ నేతలను ఉద్దేశించి షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాష్ట్ర సమస్యలపై జరిగే ప్రజా పోరాటాలకు మాత్రమే తన మద్దతు ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, ప్రజల పక్షాన నిలబడతానని ఆమె పునరుద్ఘాటించారు. షర్మిల వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.