Donald Trump: టెస్లా కారు, ఎలాన్ మస్క్‌పై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

- ఎలాన్ మస్క్‌తో విభేదాల వేళ డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు
- టెస్లా కారును వదిలే ప్రసక్తే లేదు, అందులో చక్కర్లు కొడతానన్న ట్రంప్
- వైట్‌హౌస్‌లో స్టార్‌లింక్ సేవలు కొనసాగుతాయి, అదో మంచి సర్వీస్ అని ప్రశంస
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వివాదానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా విలేకరుల సమావేశంలో ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. మస్క్‌కు చెందిన టెస్లా కారును తాను వదులుకోబోనని, స్టార్‌లింక్ సేవలను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల ట్రంప్, మస్క్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, మస్క్ కంపెనీ అయిన టెస్లా నుంచి ట్రంప్ కొనుగోలు చేసిన కారును ఇకపై ఉపయోగించబోరనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంపై విలేకరులు ప్రశ్నించగా, ట్రంప్ బదులిస్తూ, "అలాంటిదేమీ లేదు. నేను ఆ కారులో చక్కర్లు కొడతాను" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, వైట్‌హౌస్‌లో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే ఆలోచన కూడా తనకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. స్టార్‌లింక్ మంచి సేవలను అందిస్తోందని ఆయన ప్రశంసించారు.
ఎలాన్ మస్క్‌తో మాట్లాడాలనుకుంటున్నారా అని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, "నేను అతడి స్థానంలో ఉంటే, మాట్లాడాలనే అనుకునేవాడిని. బహుశా అతడు కూడా అదే అనుకుంటుండవచ్చు. ఈ విషయం అతడినే అడగాలి. అతనికి నా అభినందనలు" అని అన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను ఓ నెటిజన్ 'ఎక్స్'లో పోస్ట్ చేయగా, దానికి ఎలాన్ మస్క్ హార్ట్ ఎమోజీతో ప్రతిస్పందించడం గమనార్హం.