Chiranjeevi: యోగా.. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గిఫ్ట్: చిరంజీవి

- యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ చిరు సోషల్ మీడియా పోస్టు
- జూన్ 21న యోగా దినోత్సవాన్ని అందరూ కలిసి జరుపుకోవాలని పిలుపు
- యోగా వల్ల ఫోకస్, ఫిట్‌నెస్ రెండూ పెరుతాయన్న చిరు
మెగాస్టార్ చిరంజీవి యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా తన అమూల్యమైన అభిప్రాయాన్ని పంచుకున్నారు. యోగాను ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్ గా ఆయన పేర్కొన్నారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని అందరూ కలిసి జరుపుకోవాలని చిరు పిలుపునిచ్చారు. ఈ మేరకు మెగాస్టార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పెషల్ పోస్టు పెట్టారు.
"ఫోకస్ వల్ల ఫిట్‌నెస్ పెరుగుతుంది. కానీ, యోగా ఈ రెండింటినీ పెంచుతుంది. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా డేను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. సరిహద్దులు దాటి దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం" అని రాసుకొచ్చారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత రెండింటినీ పెంపొందించడంలో యోగా ఒక సమగ్రమైన మార్గమని ఈ సందర్భంగా చిరంజీవి నొక్కి చెప్పారు.
ఇక, యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో యోగా డేను నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో యోగా దినోత్సవంపై ప్రజల్లో ఉత్సహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని మోదీ అన్నారు.