Vijay Mallya: విజయ్ మాల్యా పాడ్‌కాస్ట్ యూట్యూబ్‌లో వైరల్.. 4 రోజుల్లో 2 కోట్ల వ్యూస్

- తన నిజ స్వరూపం ప్రపంచానికి తెలుస్తోందన్న మాల్యా
- అప్పులన్నీ ఇప్పటికే తీరిపోయాయి, దొంగ అనొద్దని విజ్ఞప్తి
- బ్యాంకులకు చెల్లించాల్సిన రూ. 6,200 కోట్లు రికవరీ అయ్యాయని వాదన
ప్రముఖ వ్యాపారవేత్త, పరారీలో ఉన్న విజయ్ మాల్యా ఇటీవల ఓ యూట్యూబర్ కు ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ గా మారింది. దాదాపు నాలుగు గంటలకు పైగా ఉన్న ఈ ఇంటర్వ్యూను నాలుగు రోజుల్లోనే 2 కోట్ల మందికి పైగా వీక్షించారు. దీనిపై విజయ్ మాల్యా తాజాగా స్పందిస్తూ.. తన నిజమైన, వాస్తవ కథనం ప్రజలకు చేరుతుండటం పట్ల వినమ్రతతో, ఆనందంతో ఉప్పొంగిపోతున్నానని తెలిపారు. "నా మాటలు వింటున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి" అని మాల్యా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో ఓ పోస్టు పెట్టారు.
ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తున్న మాల్యా, 2025 ఐపీఎల్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మాజీ యజమాని. రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలతో 2016లో ఆయన భారత్ విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆరోపణలన్నింటినీ మాల్యా ఖండించారు. తాను చెల్లించాల్సిన రూ. 6,200 కోట్ల అప్పు ఇప్పటికే రికవరీ అయిందని ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టుకు సమర్పించిన నివేదికలో మాల్యా పేర్కొన్నారు. తన నుండి, యునైటెడ్ బ్రూవరీస్ నుండి, ఇతర సర్టిఫికేట్ రుణగ్రహీతల నుండి రికవరీ అయిన మొత్తాలపై వివరణాత్మక ఖాతా స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.