టెన్నిస్ చరిత్రలో మరో అద్భుత ఫైనల్.. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్!

  • ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్ గెలుచుకున్న కార్లోస్ అల్కరాజ్
  • వరల్డ్ నెంబర్ వ‌న్‌ జానిక్ సిన్నర్‌పై ఐదు సెట్ల థ్రిల్లర్‌లో విజయం
  • రెండు సెట్లు వెనుకబడిన తర్వాత అద్భుత పునరాగమనం
  • అల్కరాజ్‌కు ఇది ఐదవ గ్రాండ్‌స్లామ్ టైటిల్
  • నాలుగో సెట్‌లో మూడు ఛాంపియన్‌షిప్ పాయింట్లు కాపాడుకున్న అల్కరాజ్
  • టెన్నిస్ చరిత్రలో చిరస్మరణీయ ఫైనల్స్‌లో ఒకటిగా ఈ మ్యాచ్
 టెన్నిస్ అభిమానులకు కనుల పండుగలా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ చారిత్రక విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన హోరాహోరీ తుది పోరులో వరల్డ్ నంబర్ వ‌న్‌ ఆటగాడు జానిక్ సిన్నర్‌పై అల్కరాజ్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచి, ఐదు సెట్ల మారథాన్ మ్యాచ్‌లో గెలుపొందాడు. ఈ విజయంతో అల్కరాజ్ తన కెరీర్‌లో ఐదవ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడాడు. టెన్నిస్ చరిత్రలో చిరస్మరణీయ ఫైనల్స్‌లో ఒకటిగా ఈ మ్యాచ్ నిలిచిపోతుందని క్రీడా విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు.

దాదాపు ఐదు గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 22 ఏళ్ల అల్కరాజ్, సిన్నర్‌పై 4-6, 6-7 (4-7), 6-4, 7-6 (7-3), 7-6 (10-2) తేడాతో విజయం సాధించాడు. ఓటమి అంచున నిలిచినప్పటికీ అల్కరాజ్ చూపిన పట్టుదల, నైపుణ్యం అసాధారణం. ముఖ్యంగా తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత కూడా అతను మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఆడిన తీరు ప్రశంసనీయం. ఈ మ్యాచ్‌కు ముందు, తొలి రెండు సెట్లు ఓడిపోయిన తర్వాత గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ గెలవని (0-8 రికార్డు) అల్కరాజ్, ఈసారి ఆ రికార్డును తిరగరాశాడు. మరోవైపు, తొలి రెండు సెట్లు గెలిచిన తర్వాత సిన్నర్ వరుసగా 39 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలో గెలుపొందగా, ఈసారి ఆ విజయపరంపరకు అల్కరాజ్ బ్రేక్ వేశాడు.

మ్యాచ్‌లో నాలుగో సెట్ అత్యంత కీలకంగా మారింది. ఈ సెట్‌లో సిన్నర్ మూడు ఛాంపియన్‌షిప్ పాయింట్లను దక్కించుకున్నప్పటికీ, అల్కరాజ్ వాటిని కాపాడుకుని సెట్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లి గెలిచాడు. ఇక నిర్ణయాత్మక ఐదో సెట్‌లో ఇరువురు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. సిన్నర్ 6-5 ఆధిక్యంలో ఉన్న సమయంలో అల్కరాజ్ 12వ గేమ్‌లో ఒత్తిడిని జయించి టైబ్రేక్‌కు దారితీశాడు. ఆపై ఫస్ట్-టు-10 టైబ్రేక్‌ను 10-2 తేడాతో సునాయాసంగా గెలుచుకుని టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అల్కరాజ్ ఆడిన అద్భుతమైన షాట్లతో మ్యాచ్ ముగిసింది.

ఈ విజయంతో అల్కరాజ్ వరుసగా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అంతేకాకుండా 22 సంవత్సరాల 34 రోజుల వయసులో ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన మూడో పిన్న వయస్కుడిగా ఓపెన్ ఎరాలో రికార్డు సృష్టించాడు. ఇక‌, అల్కరాజ్ విజయంపై టెన్నిస్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపించింది. రాఫెల్ నాదల్, బిల్లీ జీన్ కింగ్ వంటి దిగ్గజాలు అభినందనలు తెలిపారు. కాగా, ఈ ప‌రాజ‌యంతో సిన్నర్ తన నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్, వరుసగా మూడో మేజర్ టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. 


More Telugu News