Border: ఈ సరిహద్దులు చాలా స్పెషల్ గురూ.. గీత దాటితే దేశం మారుతుంది

Special Borders Between Countries
  • దేశాలను కలిపే అపురూప దృశ్యాలు
  • ప్రపంచంలోని కొన్ని చిత్రమైన సరిహద్దులు
  • ఒకే ఊరు, రెండు దేశాలు.. ఇళ్లలోనే దేశాలు మారిపోయే పరిస్థితి
  • అమెరికా-కెనడా మధ్య లైబ్రరీలోనే అంతర్జాతీయ సరిహద్దు
దేశాల మధ్య ఉండే సరిహద్దులు సాధారణంగా విభజనకూ, నియంత్రణకూ చిహ్నాలుగా కనిపిస్తాయి. కానీ కొన్ని సరిహద్దులు ఇందుకు మాత్రం రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక వారధులుగా, విభిన్న అనుభూతులను పంచుతూ ఆశ్చర్యపరుస్తాయి. కేవలం మ్యాప్‌లోని గీతలు మాత్రమే కాకుండా మానవ సంబంధాలను, చారిత్రక అనుబంధాలను ప్రతిబింబిస్తాయి.

ఇటు ఛాయ్.. అటు మోమోలు (భారత్–నేపాల్).. 
భారతదేశం-నేపాల్ మధ్య ఉత్తరాఖండ్‌లోని ధార్‌చులా, నేపాల్‌లోని ధార్‌చులా పట్టణాలు కాళీ నదికి ఇరువైపులా విస్తరించి ఉన్నాయి. ఒకే పేరుతో రెండు దేశాల్లో ఉన్న ఈ ప్రాంతం, సరిహద్దు ఉన్నప్పటికీ ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని చూపుతుంది. ఇక్కడ ప్రజలు పాస్‌పోర్ట్ తనిఖీలు లేకుండానే స్వేచ్ఛగా అటూఇటూ రాకపోకలు సాగిస్తుంటారు. ఒకవైపు భారతీయ ఛాయ్ దొరికితే, మరికొన్ని అడుగుల దూరంలో నేపాలీ మోమోలు రుచి చూడవచ్చు.

ఇళ్ల మధ్యలో దేశాలు మారిపోతాయ్ (బెల్జియం-నెదర్లాండ్స్).. 
బార్లే పట్టణం పరిస్థితి మరీ విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ సరిహద్దు రేఖలు వీధుల మధ్య నుంచే కాకుండా, కొన్ని ఇళ్ల మధ్యలోంచి కూడా వెళ్తాయి. ఒకే ఇంట్లో ఉంటూనే రెండు దేశాల పౌరసత్వం కలిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
 
లైబ్రరీలో రెండు దేశాల సరిహద్దు (అమెరికా–కెనడా).. 
అమెరికాలోని డెర్బీ లైన్, కెనడాలోని స్టాన్‌స్టెడ్ పట్టణాల మధ్య సరిహద్దు ఒక పబ్లిక్ లైబ్రరీ గుండా వెళుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన, విలక్షణమైన సరిహద్దుల్లో ఒకటిగా నిలుస్తుంది.
 
దేశాలు మాత్రమే వేరు (భారత్–మయన్మార్).. 


మణిపూర్‌లోని మోరే వద్ద భారతదేశం-మయన్మార్ సరిహద్దు రెండు దేశాల సంస్కృతుల మేళవింపునకు అద్దం పడుతుంది. ఇక్కడ స్థానిక ప్రజలు ఒకే రకమైన వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు పంచుకుంటూ, భాషాపరమైన సారూప్యతలతో కలిసిమెలిసి జీవిస్తారు. ఇలాంటి సరిహద్దులు దేశాలను భౌగోళికంగా విడదీసినా, ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Border
India Nepal border
Nepal
India Myanmar border
Belgium Netherlands border
America Canada border
Darchula
Moreh Manipur
Barle
Derby Line

More Telugu News