ఆ పాపం దేశంలోని ప్రతి ఎంపీ, ముఖ్యమంత్రికి చుట్టుకుంటుంది: రాజాసింగ్

  • బక్రీద్ సందర్భంగా గోవధపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం
  • లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి తగులుతుందన్న రాజాసింగ్
  • గోవధ నిషేధానికి పార్లమెంట్‌లో బిల్లు ఎందుకు తేవడం లేదని ప్రశ్న
  • గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్
  • గోవధను అడ్డుకుంటున్నందుకే తనను హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపణ
బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ జరుగుతోందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. వ్యవసాయానికి ఉపయోగపడే ఆవులు, ఎద్దులను వధించడం మహా పాపమని ఆయన అన్నారు. ఈ పాపం కేవలం వధించిన వారికే కాకుండా, దేశంలోని ప్రతి పార్లమెంట్ సభ్యుడికి, వారి కుటుంబ సభ్యులకు కూడా తగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పాపం వారిని తరతరాలు వెంటాడుతుందని ఆయన హెచ్చరించారు.

గోవధను ఎందుకు నిషేధించడం లేదని రాజాసింగ్ పార్లమెంట్‌ను ప్రశ్నించారు. "గతంలో కొందరు సభ్యులు గోవధ నిషేధంపై ప్రైవేటు బిల్లు పెట్టినప్పుడు మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి" అని ఎంపీలను ఉద్దేశించి అన్నారు. గోవులను చంపి తినేవారితో పాటు, ఈ విషయంలో మౌనంగా ఉంటున్న ఎంపీలకు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఈ పాపంలో భాగం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇలాంటి పాపానికి గురికాకుండా ఉండాలంటే, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో గోవధను పూర్తిగా నిషేధిస్తూ చట్టం తీసుకురావాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గోవధను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నందునే గత రెండు మూడు రోజులుగా తనను గృహ నిర్బంధంలో ఉంచారని ఆరోపించారు.


More Telugu News