ఆది సాయి కుమార్ 'శంబాల' టీజ‌ర్ విడుద‌ల‌.. త‌మ‌న్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

  • ఆది సాయికుమార్, ఉగంధ‌ర్ ముని కాంబోలో 'శంబాల‌' 
  • హీరోయిన్‌గా అర్చన అయ్యర్.. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం
  • ఆదికి ఆల్ ది బెస్ట్ చెబుతూ త‌మ‌న్ ట్వీట్‌
టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'శంబాల‌'. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

‘ఈ విశ్వంలో అంతు పట్టని రహస్యాలెన్నో ఉన్నాయి.. సైన్స్‌కి సమాధానం దొరకనప్పుడు మూఢ నమ్మకం అంటుంది.. అదే సమాధానం దొరికితే అదే తన గొప్పదనం అంటుంది’..  ‘పంచ భూతాలని శాసిస్తోందంటే ఇది సాధారణమైనది కాదు..  దీని ప్రభావం వల్ల మనం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం’.. ‘ఇప్పుడు ఈ రక్కసి క్రీడను ఆపాలంటే’ వంటి డైలాగ్స్ వున్నాయి. 

ఇక ఇందులో అంతరిక్షం నుంచి ఏదో ఒక అతీంద్రయ శక్తి ఉన్న ఉల్క, రాయి లాంటిది ఓ గ్రామంలో పడటం.. దాని ప్రభావంతో ఊర్లోని జనాలు చనిపోవడం, వింతగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. దాన్ని ఛేదించేందుకు హీరో రావడం.. ఓ ఊరితో పోరాటం చేయడం వంటి అంశాలతో శంబాలను తెరకెక్కిస్తున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

శ్రీచ‌ర‌ణ్ పాకాల బాణీలు అందిస్తున్న‌ ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్, స్వాసిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిజ్జు, హర్షవర్ధన్, ప్రవీణ్, రామరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇదిలాఉంటే... టీజ‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్... హీరో ఆది సాయికుమార్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా పోస్టు పెట్టారు. "ఆది నీకు ఎల్ల‌ప్పుడూ విజ‌యమే క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను బ‌డ్డీ. నీకు, నీ చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు" అంటూ త‌మ‌న్ ట్వీట్ చేశారు. 



More Telugu News