BCCI: చిన్నస్వామి స్టేడియం ఘటన.. ఇకపై చూస్తూ ఊరుకోమంటూ బీసీసీఐ సీరియ‌స్!

BCCI Serious on Chinnaswamy Stadium Incident

  • ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాటలో 11 మంది మృతి
  • ఈ ఘటనపై బీసీసీఐ తీవ్ర దిగ్భ్రాంతి
  • నిర్వాహకుల ప్రణాళికా లోపమే కారణమన్న బీసీసీఐ కార్యదర్శి
  • భవిష్యత్ భారీ కార్యక్రమాలపై పునరాలోచన చేస్తామన్న‌ బీసీసీఐ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆనందంలో జరిగిన వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది అభిమానులు మృతి చెందగా, 50 మంది వ‌ర‌కు గాయపడ్డారు. ఈ దురదృష్టకర సంఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఆర్సీబీ జట్టు చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీగా అభిమానులు గుమిగూడారు. తొలుత విధాన్ సౌధ నుంచి స్టేడియం వరకు ఓపెన్-టాప్ బస్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని భావించినప్పటికీ, జనసందోహం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయినప్పటికీ, వేలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది.

ఈ దుర్ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ... ఇది కళ్లు తెరిపించే సంఘటన అని, క్రికెట్ బోర్డు కేవలం ప్రేక్షకపాత్ర వహించద‌ని స్పష్టం చేశారు. నిర్వాహకులు మరింత మెరుగ్గా ప్రణాళిక వేసి ఉండాల్సింద‌ని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆర్‌సీబీకి సంబంధించిన ప్రైవేటు వ్య‌వ‌హారం. కానీ, ఈ దేశంలో క్రికెట్ వ్య‌వ‌హారాల‌కు తాము బాధ్య‌త తీసుకోవాల్సిందేన‌ని పేర్కొన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమాల విషయంలో పునరాలోచిస్తామన్నారు. నిర్వాహకులు, స్థానిక అధికారులు, పోలీసుల మధ్య మెరుగైన సమన్వయం, పటిష్టమైన జన నియంత్రణ చర్యలు అవసరమని ఈ సంద‌ర్భంగా ఆయన నొక్కిచెప్పారు.

ఇక‌, బెంగ‌ళూరు దుర్ఘటన క్రీడా కార్యక్రమాల భద్రతపై విస్తృత చర్చకు దారితీసిన సంగ‌తి తెలిసిందే. భార‌త్‌లో క్రికెట్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ నేప‌థ్యంలో సరైన ప్రణాళిక, నియంత్రణ లేకపోతే ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ ఘటన స్పష్టం చేసింది. బెంగళూరు విషాదం పునరావృతం కాకుండా నిరోధించడానికి, బీసీసీఐ క్రీడా సంబంధిత బహిరంగ వేడుకల కోసం కఠినమైన మార్గదర్శకాలు, మరింత పటిష్టమైన భద్రతా ప్రమాణాలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

BCCI
Bengaluru Stampede
Chinnaswamy Stadium
RCB
Royal Challengers Bangalore
IPL
Fan Stampede
Cricket
Devajit Saikia
Crowd Control
  • Loading...

More Telugu News