Manish Gupta: శాలరీ అడిగాడని డ్రైవర్‌ను కత్తితో పొడిచిన బాలీవుడ్ డైరెక్టర్

- బాలీవుడ్ దర్శకుడు మనీశ్ గుప్తాపై పోలీసులకు ఫిర్యాదు
- బాధితుడు మహమ్మద్ లష్కర్‌కు ఆసుపత్రిలో చికిత్స
- మనీశ్ గుప్తాపై పలు సెక్షన్లపై కేసు నమోదు
- 'రహస్య', 'ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్' వంటి చిత్రాలకు మనీశ్ దర్శకత్వం
'రహస్య', 'ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్' వంటి చిత్రాలతో పేరుపొందిన బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత మనీశ్ గుప్తా జీతం అడిగిన తన డ్రైవర్‌ను కత్తితో పొడిచినట్టు వర్సోవా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు మహమ్మద్ లష్కర్ గత మూడేళ్లుగా మనీశ్ గుప్తా వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నెలకు రూ. 23,000 జీతంగా నిర్ణయించారు. అయితే, గుప్తా తరచూ జీతం చెల్లింపులో జాప్యం చేస్తుండటంతో ఇరువురి మధ్య పలుమార్లు వాగ్వివాదం జరిగినట్లు లష్కర్ ఆరోపించారు. గత నెల జీతం కూడా చెల్లించకపోవడంతో పాటు, మే 30న లష్కర్‌ను గుప్తా పనిలోంచి తొలగించాడు.
జూన్ 3న లష్కర్ తనకు రావాల్సిన జీతం గురించి గుప్తాను ఫోన్‌లో అడగ్గా, తిరిగి పనిలో చేరితేనే జీతం ఇస్తానని దర్శకుడు చెప్పినట్లు సమాచారం. దీంతో, మరుసటి రోజు లష్కర్ విధుల్లో చేరినప్పటికీ, బకాయిపడ్డ జీతం మాత్రం అందలేదు.
ఈ క్రమంలో 5న రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో వర్సోవాలోని సాగర్ సంజోగ్ భవనంలోని గుప్తా నివాసంలో ఇరువురూ ఉన్నప్పుడు లష్కర్ మరోసారి జీతం ప్రస్తావన తీసుకురావడంతో మాటామాటా పెరిగింది. ఈ వాగ్వివాదం తీవ్రస్థాయికి చేరడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన మనీశ్ గుప్తా వంటగదిలోని కత్తితో లష్కర్‌పై దాడి చేశాడు.
దాడి అనంతరం లష్కర్ అక్కడి నుంచి తప్పించుకుని భవనం వాచ్‌మెన్‌కు, సమీపంలోని మరో డ్రైవర్‌కు విషయం తెలిపి వారి సహాయంతో విలేపార్లే వెస్ట్‌లోని కూపర్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ వైద్య చికిత్స అనంతరం, బాధితుడు వర్సోవా పోలీస్ స్టేషన్‌లో మనీశ్ గుప్తాపై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా మనీశ్ గుప్తాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనీశ్ గుప్తా ఇటీవల రవీనా టాండన్, మిలింద్ సోమన్ నటించిన 'వన్ ఫ్రైడే నైట్' చిత్రానికి దర్శకత్వం వహించాడు. గతంలో ఆయన రామ్ గోపాల్ వర్మ బృందంలో స్క్రీన్ ప్లే రచయితగా 'డి', 'సర్కార్' వంటి చిత్రాలకు పనిచేశాడు.