World Bank Report: భారత్‌లో పేదరికంపై ప్రపంచ బ్యాంకు కీలక నివేదిక.. పదేళ్లలో భారీ తగ్గుదల!

Extreme Poverty Rate Drops In India says World Bank Report
  • దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన తీవ్ర పేదరికం
  • దాదాపు 26 కోట్లకు పైగా మంది పేదరికం నుంచి విముక్తి
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలే కీలకమని వెల్లడి
  • గ్రామీణ, పట్టణాల్లోనూ సమానంగా తగ్గిన పేదలు
  • ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాల్లో ఈ వివరాలు
భారతదేశం పేదరిక నిర్మూలనలో ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. గత దశాబ్ద కాలంలో దేశంలో తీవ్ర పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలు ఈ మార్పునకు దోహదపడ్డాయని ఈ నివేదిక పేర్కొంది. 

ప్రపంచ బ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం... 2011-12 సంవత్సరంలో భారతదేశంలో తీవ్ర పేదరికం రేటు 27.1 శాతంగా ఉండగా, 2022-23 నాటికి ఇది కేవలం 5.3 శాతానికి పడిపోయింది. ఈ గణాంకాలు దేశ ఆర్థిక ప్రగతికి, ప్రభుత్వ పథకాల ఫలవంతమైన అమలుకు అద్దం పడుతున్నాయి. సంఖ్యాపరంగా చూస్తే, 2011-12లో 344.47 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవించగా, 2022-23 నాటికి ఈ సంఖ్య 75.24 మిలియన్లకు తగ్గింది. అంటే, సుమారు 11 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 269 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ తగ్గుదల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానంగా కనిపించిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

రోజుకు 3 డాలర్ల (2021 ధరల ప్రకారం) అంతర్జాతీయ పేదరిక రేఖను ప్రామాణికంగా తీసుకుని ఈ అంచనాలు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 10.7 శాతం నుంచి 1.1 శాతానికి చేరిందని తాజా డేటా వెల్లడించింది. దేశంలో గతంలో అధిక సంఖ్యలో పేదలున్న ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు ఈ మొత్తం పేదరిక తగ్గుదలలో మూడింట రెండు వంతుల వాటాను అందించడం గమనార్హం. 2011-12లో దేశంలోని మొత్తం తీవ్ర పేదలలో 65 శాతం మంది ఈ రాష్ట్రాల్లోనే ఉండేవారు.

భారతదేశం బహుముఖ పేదరిక సూచిక (MPI)లో కూడా విశేషమైన పురోగతిని సాధించింది. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునే ఈ సూచిక 2005-06లో 53.8 శాతంగా ఉండగా, 2019-21 నాటికి 16.4 శాతానికి, 2022-23 నాటికి మరింతగా 15.5 శాతానికి తగ్గింది.

కీల‌క పాత్ర పోషించిన ప్రభుత్వ పథకాల అమ‌లు
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో పేదరిక నిర్మూలనకు, ప్రజల సాధికారతకు, మౌలిక సదుపాయాల కల్పనకు, సమ్మిళిత వృద్ధికి ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలను ప్రధాని మోదీ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు గృహ వసతి, పరిశుభ్రమైన వంట ఇంధనం, బ్యాంకింగ్ సేవలు, ఆరోగ్య సంరక్షణ వంటివి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

అలాగే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT), డిజిటల్ సమ్మిళితత, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన వంటివి పారదర్శకతను పెంచి, లబ్ధిదారులకు ప్రయోజనాలు వేగంగా చేరేలా చేశాయి. తద్వారా 26 కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని జయించడానికి దోహదపడ్డాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
World Bank Report
Narendra Modi
India poverty reduction
poverty rate India
PM Awas Yojana
PM Ujjwala Yojana
Jan Dhan Yojana
Ayushman Bharat
India economic growth

More Telugu News