Revanth Reddy: జైలు నుంచి బయటకు వచ్చి తొడగొట్టి చెప్పాను: ఆలేరు సభలో రేవంత్ రెడ్డి

Revanth Reddy Vows Development at Aleru Meeting
షార్ట్స్‌లో చూడండి
నన్ను జైలుకు పంపిన వారిని గద్దె దించుతానని శపథం చేశానని, ఆ విధంగా తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆలేరు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, "నాకు ఇతర కోరికలేమీ లేవు. నన్ను జైలుకు పంపిన వ్యక్తిని పదవి నుంచి తొలగించాలనుకున్నాను. పట్టుదలతో వారిని గద్దె దించడమే కాకుండా, ఆ కుర్చీలో కూడా కూర్చున్నాను. నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాను. ఇకపై మీ (ప్రజలు) లక్ష్యాలను నెరవేర్చడానికే ఒక సోదరుడిగా కష్టపడతాను. నన్ను జైల్లో పెట్టిన వ్యక్తిని పడగొడతానని జైలు నుంచి బయటకు వచ్చిన రోజే తొడగొట్టి చెప్పాను" అని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో పర్యటించి, సుమారు రూ.1500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, "యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మార్చాం. కొండపై భక్తులు స్వేచ్ఛగా నిద్రించేలా, ఆటోలు యథావిధిగా నడిచేలా చర్యలు తీసుకుంటాం. యాదగిరిగుట్ట ఆలయ గోపురం నిర్మాణానికి 60 కిలోల బంగారం కేటాయించాలని నిర్ణయించాం. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో తెలంగాణలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) ఏర్పాటు చేశాం. యాదగిరిగుట్టలోని విద్యాసంస్థలను విశ్వవిద్యాలయ స్థాయికి అభివృద్ధి చేస్తాం" అని ముఖ్యమంత్రి వివరించారు.

"ఎవరు అడ్డుపడినా మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతాం. నల్గొండ రైతులను ఆదుకుంటాం. గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతాం. దేశంలో సబర్మతి, గంగా నదులను ప్రక్షాళన చేయగలిగినప్పుడు, మూసీ నదిని ఎందుకు శుద్ధి చేయకూడదు?" అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాలతో పోటీ పడదని, టోక్యో, న్యూయార్క్ నగరాలతోనే పోటీ పడి అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. "బంగారు తెలంగాణ ముసుగులో పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నవారా నన్ను ప్రశ్నించేది? వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పి అక్కడి ఇళ్లన్నీ కూలగొట్టారు. ఆ తర్వాత కేసీఆర్ ఆ గ్రామాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారు. విద్యార్థులు, రైతులు, ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నారు" అని ఆయన ఆరోపించారు.

ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "రాష్ట్ర బడ్జెట్ రూ.20 లక్షల కోట్లు ఉంటే, కేవలం రూ.2 వేల కోట్లతో పూర్తి చేయాల్సిన ఎస్సెల్బీసీ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. యాదగిరిగుట్టలో అపచారాలకు పాల్పడినందుకే బీఆర్ఎస్ పరిస్థితి ఇలా తయారైంది. మీరు చేసిన పాపాల వల్లే ఈ దుస్థితి వచ్చింది" అని సీఎం అన్నారు.

"తమ పార్టీలో దెయ్యాలు చేరాయని ఆ పార్టీ నాయకురాలే స్వయంగా చెప్పారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దెయ్యాల నేత ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారు. బీఆర్ఎస్ కాదు.. అది డీఆర్ఎస్.. అంటే దెయ్యాల రాజ్య సమితి. ఈ కొరివి దెయ్యాలను తరిమికొట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఇందుకు పార్టీ కార్యకర్తల పూర్తి సహకారం కావాలి" అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana CM
Aleru Meeting
Yadadri Bhuvanagiri
BRS Government

More Telugu News