బెంగళూరు తొక్కిసలాట కేసు.. ఎవరీ నిఖిల్ సోసాలె?

  • ఆర్సీబీ మార్కెటింగ్, రెవెన్యూ హెడ్‌ నిఖిల్ సోసాలె అరెస్ట్
  • రెండేళ్లుగా ఆర్సీబీ మార్కెటింగ్, రెవెన్యూ విభాగానికి అధిపతిగా సోసాలె
  • ముంబైకి వెళ్తుండగా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో బెంగళూరు ఫ్రాంచైజీకి చెందిన నలుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆర్సీబీ మార్కెటింగ్, రెవెన్యూ విభాగం చీఫ్ నిఖిల్ సోసాలె కూడా ఉన్నారు. తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన ఆర్సీబీ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు హత్యాయత్నం కిందకు రాని నేరం  (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో నిఖిల్ సోసాలెను ఈ ఉదయం సుమారు 6:30 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మరో ముగ్గురు సభ్యులను కూడా అరెస్ట్ చేశారు.

ఎవరీ నిఖిల్ సోసాలె?
నిఖిల్ సోసాలె రెండేళ్లుగా ఆర్సీబీ మార్కెటింగ్, రెవెన్యూ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆయన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం సోసాలె వాస్తవానికి ఆర్సీబీ యాజమాన్య సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్‌ఎల్)ను నిర్వహిస్తున్న డయాజియో ఇండియా ఉద్యోగి. మాజీ యజమాని విజయ్ మాల్యా వైదొలిగిన తర్వాత ఆర్సీబీకి యూఎస్‌ఎల్ పూర్తిస్థాయి యజమానిగా మారింది.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సోసాలె 13 ఏళ్లుగా డయాజియో సంస్థలో పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఆర్సీబీ ఫ్రాంచైజీతో చాలా దగ్గరగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆర్సీబీ బ్రాండ్ డిజైన్, వ్యూహరచనలో సోసాలె కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. గతంలో ఆయన ఆర్సీబీలో బిజినెస్ పార్ట్‌నర్‌షిప్స్ విభాగానికి కూడా హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తరచూ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి ఆర్‌సీబీ ప్రైవేట్ బాక్సుల్లో సోసాలె కనిపిస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ కూడా ఆయన్ను ఫాలో అవుతున్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న జేమ్స్ కుక్ యూనివర్సిటీ నుంచి ఆయన డబుల్ మేజర్ పూర్తి చేశారు.

ఆర్‌సీబీ మార్కెటింగ్, వ్యాపార వ్యూహాల్లో సంవత్సరాలుగా పాలుపంచుకుంటున్నందున, ఫ్రాంచైజీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన బస్ పరేడ్ నిర్వహణలో సోసాలె పాత్ర ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే, ఆటగాళ్లు, ఫ్రాంచైజీ అధికారుల మధ్య సమన్వయకర్తగా కూడా ఆయన వ్యవహరించి ఉండవచ్చని తెలుస్తోంది. 

సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్షయ్ నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిని నేడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)కి అప్పగించే అవకాశం ఉంది.  


More Telugu News