ఆర్‌సీబీ ఆట‌గాళ్ల‌ 'బోల్డ్' సెల‌బ్రేష‌న్స్.. వీడియో చూశారా?

  • ఆర్‌సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ విజయం
  • ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో గెలుపు
  • 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన బెంగళూరు జట్టు
  • టీమ్ బ‌స చేసిన‌ హోటల్‌లో కెప్టెన్ రజత్, కృనాల్ డ్యాన్స్‌ తో సందడి
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టును 6 పరుగుల తేడాతో ఓడించి ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గెలుపు అనంతరం టీమ్ హోటల్‌లో జరిగిన సంబరాల్లో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా డ్యాన్స్‌లతో సందడి చేశారు.

ఈ చారిత్రక విజయం ఆర్‌సీబీ యాజమాన్యానికి, ఆటగాళ్లకు, కోట్లాది మంది అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. గతంలో మూడు సార్లు టైటిల్‌కు చేరువై త్రుటిలో చేజార్చుకున్న‌ ఆర్‌సీబీ... ఈసారి పట్టుదలతో ఆడి కలను సాకారం చేసుకుంది. కెప్టెన్ రజత్ పాటిదార్, జట్టు సభ్యుడు కృనాల్ పాండ్యాతో కలిసి హోటల్‌లో జరిగిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ విక్ట‌రీని సెల‌బ్రేట్ చేసుకున్నారు.  ముఖ్యంగా కృనాల్ తనదైన స్టెప్పులతో అందరినీ ఉత్సాహపరిచాడు. ఆర్‌సీబీ ఆట‌గాళ్ల బోల్డ్ సెల‌బ్రేష‌న్స్ తాలూకు వీడియోను జ‌ట్టు త‌న అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.  

ఇక‌, మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్‌ను ఆర్‌సీబీ బౌలర్లు సమష్టిగా కట్టడి చేశారు. క‌ట్టుదిట్ట‌మైన‌ బౌలింగ్‌తో పంజాబ్ జట్టును 184/7 పరుగులకే పరిమితం చేసి, చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు.

గెలుపు అనంతరం స్టేడియంలో కూడా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ఆర్‌సీబీ మాజీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఈ ఫైనల్ మ్యాచ్‌కు హాజరై, విజయం తర్వాత విరాట్ కోహ్లీని ఆలింగనం చేసుకుని అభినందించారు. ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడినప్పటికీ ట్రోఫీ గెలవలేకపోయిన ఈ ఇద్దరు దిగ్గజాలు, ఈ చారిత్రక క్షణాన్ని ఆస్వాదించారు.

విజయం సాధించిన అనంతరం ఆటగాళ్లు టీమ్ హోటల్‌కు చేరుకోగా, అక్కడ సిబ్బంది, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ ఉత్సాహభరిత వాతావరణంలో రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యా తమ డ్యాన్స్‌తో సంబరాలను మరింత ఉత్సాహంగా మార్చారు. 


More Telugu News