Rangayana Raghu: ఓటీటీలో కన్నడ క్రైమ్ థ్రిల్లర్ జోరు!

- కన్నడలో రూపొందిన 'అజ్ఞాతవాసి'
- ప్రధానమైన పాత్రను పోషించిన రంగాయన రఘు
- 1990ల నేపథ్యంలో నడిచే కథ
- జీ 5 ట్రాక్ పై మరింత పుంజుకున్న సినిమా
రంగాయన రఘు .. ఇప్పుడు కన్నడలో ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ప్రధాన పాత్రగా కథలు రాయడానికి అక్కడి రచయితలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆయనే కథానాయకుడిగా సినిమాలు చేయడానికి మేకర్స్ ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఆ మధ్య ఆయన చేసిన 'శాకాహారి' సినిమా ఎంతటి విజయం సాధించిందనేది తెలిసిందే. అలాంటి ఆయన ప్రధాన పాత్రగా రూపొందిన సినిమానే 'అజ్ఞాతవాసి'.
హేమంత్ రావు నిర్మించిన ఈ సినిమాకి జనార్ధన్ చిక్కన్న దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈ సినిమా మే 28వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏ రోజుకు ఆ రోజు ఈ సినిమా పుంజుకుంటూ ఉండటం విశేషం. అంతకంతకూ ఆదరణ పెంచుకుంటూ, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.
1990ల నేపథ్యంలో నడిచే మిస్టరీ థ్రిల్లర్ ఇది. 'మల్నాడ్' సమీప గ్రామంలో పాతికేళ్ల క్రితం ఒక హత్య జరుగుతుంది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు మరో హత్య జరుగుతుంది. పైగా చనిపోయిన వ్యక్తి సాధారణమైనవాడు కాదు .. పేరున్న భూస్వామి. అందరూ కూడా ఆయనది సహజ మరణమేనని అనుకుంటారు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం ఆయనది హత్య అంటూ సందేహిస్తాడు. ఆయనలా అనుమాన పడటానికి కారణం ఏమిటి? ఆ హత్యకు కారకులు ఎవరు? గతంలోని హత్యకు .. ఈ హత్యకు గల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.